
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలన విశ్వసనీయంగా ఉండే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు పాల్పడిన బోర్డు సభ్యులు, అధికారులను సెబీ బ్లాక్ లిస్ట్ (నిషేధిత జాబితా)లో పెట్టాలని, అప్పటి వరకు వారికి చెల్లించిన పారితోషికాలను ముక్కు పిండి వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. పోటీ సంస్థలకు మేలు చేసే విధంగా లేకపోతే తప్ప.. ప్రజావేగులు చేసే ఫిర్యాదులపై దర్యాప్తు సమాచారాన్ని కూడా వాటాదారులకు అందించాలన్నారు.
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ‘కార్పొరేట్ గవర్నెన్స్’పై నిర్వహించిన కార్యక్రమంలో మూర్తి పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజా వేగు ఫిర్యాదుపై విచారణలో భాగంగా కంపెనీ బోర్డు సభ్యులు, అధికారులు తమ విశ్వసనీయ విధులను సరిగ్గా న్విహించలేదని, పాలనా లోపం ఉన్నట్టు తేలితే రాజీనామా చేయాలని కోరాలి. ప్రజా వేగు ఫిర్యాదు అన్నది అసంతృప్త ఉద్యోగి నుంచి ప్రతీకార చర్య రూపంలో ఉండరాదు. తన ఫిర్యాదుకు ఆధారంగా అవసరమైన డేటా, వాస్తవాలను ఫిర్యాదిదారు అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫిర్యాదిదారుకు వేధింపుల్లేకుండా కంపెనీ సరైన రక్షణ కల్పించాలి’’ అని నారాయణమూర్తి తన అభిప్రాయాలను వినిపించారు.
పారదర్శకత అవసరం..‘‘ప్రజా వేగు ఫిర్యాదును పరిష్కరించే విధానం పారద్శకంగా, విశ్వసనీయతను పెంచే విధంగా ఉండడం తప్పనిసరి. ఒకవేళ ఫిర్యాదు మధ్య స్థాయి లేదా దిగువ స్థాయి ఉద్యోగికి వ్యతిరేకంగా వచ్చినట్టయితే.. ఆ ఉద్యోగితో సంబంధం లేని సీనియర్ ఉద్యోగులతో ఓ కమిటీని నియమించి విచారణ నిర్వహించాలి. ఒకవేళ బోర్డు సభ్యులు లేదా చైర్మన్ లేదా సీఈవోకు వ్యతిరేకంగా పిర్యాదు దాఖలైతే.. చాలా వరకు భారతీయ కంపెనీల బోర్డులు బయటి నుంచి ఓ న్యాయ సేవల సంస్థ సహకారంతో విచారణ చేసి అస్పష్టంగా ముగించేస్తున్నారు. కానీ ఇది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు ఇటువంటి ప్రజావేగు ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో టాప్ టెన్ వాటాదారులు, సమాజంలో ఎంతో గౌరవనీయులైన వ్యక్తులను విచారణలో భాగం చేస్తున్నాయి’’ అంటూ నారాయణ మూర్తి కంపెనీల బోర్డులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదుల విచారణలో నిజాయితీ అవసరమని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment