ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల సంచలన నిర్ణయం | Infosys founders looking to sell their stake in company | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల సంచలన నిర్ణయం

Published Fri, Jun 9 2017 12:35 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల సంచలన నిర్ణయం

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల సంచలన నిర్ణయం

బెంగళూరు : దేశీయ కార్పొరేట్ చరిత్రలో మరో సంచలనం చోటుచేసుకోబోతుంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ కంపెనీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో ఉన్న మొత్తం స్టేక్ అమ్మేయడానికి సన్నద్దమవుతున్నారని వార్తలొస్తున్నాయి.. కంపెనీలో సహవ్యవస్థాపకులు కలిగిన రూ.28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను అమ్మేయాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు చోటుచేసుకున్న వివాదం తెలిసిందే. గత మూడేళ్లుగా కంపెనీ నడుస్తున్న తీరుపై వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బహిరంగంగానే పలుమార్లు బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. అయినా కూడా బోర్డు సభ్యులు ఏ మాత్రం సమస్య లేదన్న రీతిలో వ్యవహరించడం ఈ పరిణామాలకు దారితీస్తోంది. బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య వార్ కంటే కంపెనీలోని స్టేక్ ను అమ్మేసి, 1981లో తాము స్థాపించిన ఈ కంపెనీ నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడమే మేలని ప్రమోటర్స్ గ్రూప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నారాయణమూర్తి, నందన్ నిలేకని ఈ ప్రమోటర్స్ గ్రూప్ కు అధిపతులుగా ఉన్నారు.
 
1981 జూలై 2న బెంగళూరులో స్థాపించబడ్డ ఇన్ఫోసిస్, 1993లో ప్రజల ముందుకు వచ్చింది. నారాయణమూర్తి, ఎన్ఆర్ నందన్ నిలేకనితో పాటు మరో ఐదుగురు కలిసి ఈ సంస్థను స్థాపించారు. మూర్తి ఆయన భార్య సుధా మూర్తి వద్ద నుంచి 10,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఈ సంస్థను ఆరంభించారు. వీరందరూ మధ్య తరగతి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ ఎంటర్ ప్రీన్యూర్స్. అనంతరం భారత టెక్ పరిశ్రమలోనే ఇన్ఫోసిస్ రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. స్టాక్ మార్కెట్ బ్లాక్ డీల్స్ ద్వారా ఈ స్టేక్ విక్రయం ఉండొచ్చని అంచనా. అయితే ఈ విక్రయ విషయంపై నారాయణమూర్తిని సంప్రదించగా.. ఆయన ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఇది నిజం కాదని తేల్చిచెబుతున్నారు. నారాయణమూర్తి, అతని కుటుంబ సభ్యులకు కంపెనీలో 3.44 శాతం స్టేక్ ఉంది. ఆధార్ లాంచ్ చేయకముందు నందన్ నిలేకని సంస్థ అధికార బాధ్యతలను చేపట్టారు. అయితే ఇన్ఫోసిస్ పై తాను కామెంట్ చేయనని చెప్పిన నిలేకని ఈ విషయంపై మరిన్ని ప్రశ్నలపై స్పందించడానికి నిరాకరించారు. 
 
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు-మూర్తి, నిలేకని, క్రిష్ గోపాల్ క్రిష్ణన్, ఎస్డీ షిబులాల్, కే దినేష్ ప్రస్తుతం కంపెనీలో ఎగ్జిక్యూటివ్, లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ లుగా లేరు. ఇటీవల బోర్డు సభ్యులు పలు వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వారు ఆరోపించారు. కార్పొరేట్‌ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా వ్యవస్థాపకులు, మేనేజ్ మెంట్ పై మండిపడినప్పటికీ.. కంపెనీ సీఈఓ విశాల్‌ సిక్కా, బోర్డు సభ్యులు మాత్రం సమస్యే లేదన్న రీతిలో వ్యవహరిస్తుండటం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. మేనేజ్ మెంట్ వ్యవహారంతో విసుగెత్తిన కంపెనీ సహవ్యవస్థాపకులు ఏకంగా ఇన్ఫోసిస్ తో తెగదెంపులే చేసుకోవాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement