ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్
చైర్మన్‌గా శేషసాయి
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి కేవీ కామత్ వైదొలగడంతో .. ఆ స్థానంలో రామస్వామి శేషసాయి నియమితులయ్యారు. బ్రిక్స్ కూటమి దేశాల అభివృద్ధి బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నామినేట్ కావడంతో కామత్ వైదొలిగారు. దీంతో 2011 జనవరి నుంచి కంపెనీ బోర్డులో స్వతంత్ర డెరైక్టరుగా ఉన్న శేషసాయి (67)ని నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ఇన్ఫీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
ఆయన ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఆడిట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. భారీ ప్రభుత్వ రంగ సంస్థలకు సారథ్యం వహించడంలో అపార అనుభవం గల శేషసాయి నియామకం.. ఇన్ఫోసిస్ వృద్ధికి తోడ్పడగలదని కామత్ అభిప్రాయపడ్డారు. శేషసాయి ప్రస్తుతం అశోక్ లేల్యాండ్‌కి వైస్‌చైర్మన్‌గా, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇతరత్రా బాధ్యతలను కొంత మేర తగ్గించుకుని ఇన్ఫోసిస్‌కు మరింత సమయం కేటాయించడంపై దృష్టి పెట్టనున్నట్లు శేషసాయి చెప్పారు.