మూర్తిపై ఇన్ఫీ కో-చైర్మన్‌ కీలకవ్యాఖ్యలు | Infosys sees Murthy as 'well-wisher, not shareholder activist' | Sakshi
Sakshi News home page

మూర్తిపై ఇన్ఫీ కో-చైర్మన్‌ కీలకవ్యాఖ్యలు

Published Wed, Jul 26 2017 5:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

మూర్తిపై ఇన్ఫీ కో-చైర్మన్‌ కీలకవ్యాఖ్యలు

మూర్తిపై ఇన్ఫీ కో-చైర్మన్‌ కీలకవ్యాఖ్యలు

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తిపై ఆ కంపెనీ కో-చైర్మన్‌ రవి వెంకటేషన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణమూర్తిని షేర్‌ హోల్డర్‌ యాక్టివిస్ట్‌(వాటాదారు కార్యకర్త)గా పరిగణలోకి తీసుకోవడం లేదని, ఆయన్ను కేవలం శ్రేయోభిలాషిగా మాత్రమే చూస్తున్నట్టు తెలిపారు. ''ఇన్ఫోసిస్‌కు శ్రేయాభిలాషిగానే మూర్తిని నేను చూడాలనుకుంటున్నా. ప్రస్తుతం అలానే చూస్తున్నాం. ఎప్పటికీ అలానే కొనసాగిస్తాం. ఆయనకు ఏ లేదా బి అనే లేబల్‌ ఇవ్వడం ఇష్టం లేదు. కచ్చితంగా ఆయన షేర్‌ హోల్డర్‌ యాక్టివిస్ట్‌ కాదు'' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి వెంకటేషన్‌ అన్నారు.
 
మూర్తి కేవలం వ్యవస్థాపకుడు మాత్రమే కాదు, తమల్ని ముందుండి నడిపించే వ్యక్తి అని పేర్కొన్నారు. మూర్తితో ఉన్న సంబంధాలను సుదీర్ఘకాలం పాటు నిర్మాణాత్మక, ఉత్పాదక మార్గంలో కొనసాగిస్తామన్నారు. యాక్టివిస్ట్‌ షేర్‌హోల్డర్స్‌ ద్వారా తమకు ప్రమాదాలు వెల్లువెత్తుతున్నాయని, వారు తమకు ప్రమాదకరంగా మారుతున్నట్టు ఇన్ఫోసిస్‌ చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. 
 
యాక్టివిస్ట్‌ షేర్‌హోల్డర్స్‌ వారికున్న హక్కులతో యజమానులా ప్రవర్తిస్తూ, సంస్థ ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటారు. ఆ హోల్డర్స్‌ కంపెనీని రన్ చేయరు. కానీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌పై మాత్రం వారి ప్రభావం ఉంటుంది. యాక్టివిస్ట్‌ షేర్‌ హోల్డర్స్‌ తమకు ప్రమాదకరంగా మారినట్టు ఇన్ఫోసిస్‌ అమెరికా సెక్యురిటీస్‌, ఎక్స్చేంజ్‌ కమిషన్‌ వద్ద వార్షిక ఫైలింగ్‌లో పేర్కొంది. గత కొన్ని నెలలుగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ పై మూర్తికి, ఇతర ఎగ్జిక్యూటివ్‌లకు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్కదాంతోనే ఇన్ఫోసిస్‌కు ముప్పు వాటిల్లడం లేదని, ఇలా 55 అంశాలు తమకు ప్రమాదకరంగా మారాయని వెంకటేషన్‌ చెప్పారు. దానిలో సైబర్‌ సెక్యురిటీ రిస్క్‌ కూడా ఉన్నట్టు తెలిపారు.
 
కంపెనీ సీఈవోగా విశాల్‌ సిక్కా తాను చేయగలిగిదంతా మంచిగా చేస్తారని, మూర్తితో కలిపి తమ స్టేక్‌ హోల్డర్స్‌, వ్యవస్థాపకులు కంపెనీలో పెట్టుబుడులు పెడతారని ఆశిస్తున్నట్టు వెంకటేషన్‌ చెప్పారు. కొత్త డిజిటల్‌ ప్రపంచంలోకి కంపెనీ మారుతున్న క్రమంలో కంపెనీ వ్యవస్థాపకులను కోల్పోనుందా? ముఖ్యంగా మూర్తి తన పూర్తి వాటాను అమ్మేస్తే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు స్పందించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement