సెప్టెంబర్‌లో మౌలిక రంగం జోరు..!
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక విభాగాలతో కూడిన మౌలిక రంగం సెప్టెంబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించింది. ఈ నెలలో ఐదు శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో వృద్ధి 3.7 శాతంగా నమోదయ్యింది. 2016 ఆగస్టులో రేటు 3.2 శాతం. సిమెంట్, స్టీల్, రిఫైనరీ పరిశ్రమల ఉత్పత్తుల జోరు గ్రూపుకు సానుకూలమైంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 38 శాతంగా ఉన్న ఈ ఎనిమిది పారిశ్రామిక విభాగాలనూ వేర్వేరుగా పరిశీలిస్తే...
ఊపు నిచ్చిన రంగాలు...
రిఫైనరీ ప్రొడక్టులు: వార్షికంగా చూస్తే వృద్ధి 0.5% నుంచి 9.3%కి ఎగసింది.
స్టీల్: వృద్ధి 16.3 శాతంగా నమోదయ్యింది. 2015 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా -0.9 శాతం క్షీణత నమోదయ్యింది.
సిమెంట్: ఈ రంగంలో -1.6 శాతం క్షీణత 5.5 శాతం వృద్ధికి మారింది.
వృద్ధి తగ్గినవి మూడు
ఎరువులు: ఈ రంగంలో వృద్ధి 18.3 శాతం నుంచి 2.0 శాతానికి పడిపోయింది.
విద్యుత్: వృద్ధి 11.4 శాతం నుంచి 2.2 శాతానికి పడిపోయింది.
క్షీణతలో...
బొగ్గు: 2.1 శాతం వృద్ధి -5.8 శాతం క్షీణతలోకి జారింది.
క్రూడ్ ఆయిల్: -0.1 శాతం క్షీణత నుంచి -4.1 శాతం క్షీణతకు పడిపోయింది.
సహజవాయువు: ఈ రంగంలోనూ 0.9% వృద్ధి -5.5 శాతం క్షీణతకు మళ్లింది.
ఆరు నెలల్లో...
ఇక ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) ఎనిమిది రంగాలనూ చూస్తే.. వృద్ధి 2.6 శాతం నుంచి 4.6 శాతానికి ఎగసింది.