ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపకులు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. కొత్త కొత్త ఫీచర్లు రావడం, ఎక్కువ మంది సెలబ్రిటీలు దీన్ని వాడటం ఇన్‌స్టాగ్రామ్‌కు క్రేజీ పెరిగిపోతుంది. ఎనిమిదేళ్ల కింద లాంచ్ చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌ను, ఆరేళ్ల కిందట సోషల్ మీడియా దిగ్గజంగా ఉన్న ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఫేస్‌బుక్ తన సొంతం చేసుకునేటప్పుడే, దాని స్వయం ప్రతిపత్తికి ఎలాంటి ఢోకా ఉండదని వాగ్దానం చేసింది. కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ పూర్తిగా తన స్వేచ్ఛ కోల్పోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ కంపెనీలో నెలకొన్న పరిణామం కూడా ఇదే సూచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులైన సీఈవో కెవిన్ సిస్ట్రోమ్, సీటీఓ మైక్ క్రెగర్‌లు కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వారు ఎందుకు రాజీనామా చేస్తున్నారో స్పష్టత ఇవ్వకుండానే రాజీనామా లేఖను కంపెనీకి సమర్పించారు. మరికొన్ని వారాల్లో తాము కంపెనీని వీడనున్నట్టు ప్రకటించేశారు. ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుల రాజీనామా, టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇన్‌స్టాగ్రామ్‌కు, ఫేస్‌బుక్‌కు మధ్య నాయకత్వ విషయంలో విభేదాలు వచ్చినట్టు అందుకే, వీరు రాజీనామా చేసినట్టు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ కెవిన్ వైల్ గత కొన్ని రోజుల క్రితమే ఫేస్‌బుక్ కొత్త బ్లాక్ చైన్ టీమ్‌కు బదిలీ అయ్యారు. జుకర్‌బర్గ్ ఇన్నర్ సర్కిల్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్‌కు, సిస్ట్రోమ్‌కు పలుమార్లు విభేదాలు వచ్చాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘కెవిన్, మైక్ అద్భుతమైన ప్రొడక్ట్ లీడర్లు. ఇన్‌స్టాగ్రామ్ వారి సృజనాత్మక ప్రతిభనే. గత ఆరేళ్లలో వారి నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాం. నేను వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. తర్వాత ఏం అభిృద్ధి చేయబోతున్నారో చూడాల్సి ఉంది’ అంటూ మార్గ్ జుకర్‌బర్గ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వారి మధ్య గొడవలు, విభేదాలు ఉన్నట్టు జుకర్‌బర్గ్ ఎక్కడా బయటపడలేదు. అదేవిధంగా సిస్ట్రోమ్ కూడా స్పందించారు. తమ ఉత్సుకతను, సృజనాత్మకతను మరోసారి వెలికితీయాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. కాగా, 715 మిలియన్ డాలర్లు పెట్టి, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment