పన్ను ఎగవేతదారులకు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: మీరు ఎంతో ముచ్చట పడి కొనుక్కున్న లగ్జరీ కార్లు, పూర్తిగా మీ సొంతమైన విలాసవంతమైన ఇల్లు, లేదా హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేసిన ఫోటోలు.. ఎక‍్రెట్రా.. ఎక్సెట్రా... ఇలాంటి లావిష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా. అయితే.. ఇకముందు ఇలా చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.. ఎందుకంటే ఇకపై ఇలాంటి ఫోటోల ద్వారా పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం మరో కీలక చర్యను చేపట్టనుంది. బ్యాంకులు, ఖాతాల పరిశీలన లాంటి సంప్రదాయపద్ధతుల్లో మాత్రమే కాకుండా, సోషల్‌మీడియా ద్వారా కూడా తప్పుడు లెక్కలతో, భారీ ఎత్తున పన్ను ఎగవేస్తున్న వారి సమాచారాన్ని సేకరించనుందట. ఇందుకు గాను ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా పోస్టులును ఆదాయ పన్ను శాఖ పరిశీలించనుంది.
తాజా నివేదికల ప్రకారం ఆదాయపు ప్రకటనలతో, ఖర్చు నమూనాలతో సరిపోలాయో లేదో తేల్చుకునేందుకుగాను అధికారులు ఆయా వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులను పరిశీలించనున్నారు. ఈ నెలనుంచే ఈ ప్ర్రక్రియ మొదలుకానుందని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ ఇన్‌సైడ్’ పేరుతో ఈ ప్రాజెక్టు రెండు దశల్లో అమలు కానుంది. ప్రాజెక్ట్ ఇన్సైట్ ద్వారా 40శాతం పన్ను వసూలు పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టుకోసం 156 మిలియన్ డాలర్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
దీని ద్వారా కార్యాలయాలు , గృహాలపై దాడి చేయకుండా చాలా తక్కువ పన్ను చెల్లించేవారిని అధికారులు గుర్తించే అవకాశం ఉందని పేరు చెప్పడానికి అంగీకరించని అధికారి మీడియాకు చెప్పారు. ప్రాజెక్టు మొదటి దశలో 30 శాతం నుండి 40 శాతం పరిశీలన ఉంటుంది. ఈ సమయంలో క్రెడిట్ కార్డు ఖర్చు, ఆస్తి మరియు స్టాక్ పెట్టుబడులు, నగదు కొనుగోళ్లు మరియు డిపాజిట్లు సహా మొత్తం డేటా - కొత్త వ్యవస్థకు మైగ్రేట్ అవుతుంది. ఆ తరువాత పోస్టల్ లేదా ఇమెయిల్ ద్వారా టాక్స్ డిక్లరేషన్లను దాఖల చేయాలని కేంద్రం బృందం సమాచారం పంపుతుంది. ఈ డేటా విశ్లేషణ , పరిశీలనతో రెండో దశ డిసెంబర్ నుంచి మొదలుకానుంది.
కాగా ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు 2016-17 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ రిటర్న్‌కు గడువు జూలై 30తో ముగియనున్న సంగతి తెలిసిందే.