
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీమా రంగంలో బ్రోకర్ల పాత్ర గణనీయంగా వృద్ధి చెందుతోందని.. అందుకే బ్రోకర్ల కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చైర్మన్ టీఎస్ విజయన్ చెప్పారు. ఇన్సూరెన్స్ బ్రోకర్ల యాజమాన్యం, భాగస్వామ్యం తదితర అంశాలన్నీ ఇందులో పొందుపరిచామని.. కొద్ది మార్పులతో కొత్త నిబంధనలను గెజిట్ నోటిఫికేషన్ కోసం పంపిచామని.. త్వరలోనే వెలువడతాయని ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐబీఏఐ) 14వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయన్ మాట్లాడుతూ.. ‘‘బీమా పరిశ్రమతో పాటూ బ్రోకర్ల కాంట్రిబ్యూషన్ కూడా శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో సాధారణ బీమా ప్రీమియం రూ.1,28,129 కోట్లను దాటింది. ఇందులో రూ.30 వేల కోట్లు ప్రీమియంలు బ్రోకర్ల ద్వారా సమీకరించినవే. జీవిత బీమా రూ.4 లక్షల కోట్లు. ఇందులో రూ.1.60 లక్షల కోట్లు బ్రోకర్ల వాటా ఉందని’’ వివరించారు. ఆరోగ్య బీమా ఏటా 43 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని.. జీవిత, సాధారణ బీమా ఉత్పత్తులే కాకుండా ఎస్‌ఎంఈ, రిటైల్, కార్పొరేట్ రంగాల్లో వివిధ రకాల బీమా పాలసీలను తీసుకురావాల్సిన అవసరముందని సూచించారు.
పాలసీలే కాదు క్లయిమ్‌లూ ఆన్‌లైన్‌లోనే..
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలుతో బీమా పరిశ్రమ డిజిటల్ వైపు అడుగులేసేలా చేశాయని విజయన్ పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే బీమా సంస్థల మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని.. అంతేకాకుండా టెక్నాలజీ ద్వారా బీమా ఉత్పత్తుల ధర కూడా తగ్గుతుందని సూచించారు. ఆన్‌లైన్‌ను కేవలం పాలసీల విక్రయానికే కాకుండా క్లయిమ్‌లకూ వినియోగించాలని.. ఇది బీమా రంగంలో పారదర్శకతను తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు.
అవార్డులు: ప్రస్తుతం దేశంలో 428 మంది గుర్తింపు పొందిన బ్రోకర్లున్నారు. ఐబీఏఐ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పలు బీమా కంపెనీలకు అవార్డులను అందించారు. చిన్న ప్రైవేట్ సెక్టార్ సాధారణ బీమా విభాగంలో ఫ్యూచర్ జెనరల్లీ, పెద్ద ప్రైవేట్ సెక్టార్ సాధారణ బీమా రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీ, ఐఎఫ్‌ఎప్‌సీఓ టోక్కో, బజాజ్ అలయెన్జ్, పబ్లిక్ సెక్టార్ సాధారణ బీమా రంగంలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అవార్డులు అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment