ఉల్లంఘనలపై ఉక్కుపాదం | Traffic violations are more tight | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనలపై ఉక్కుపాదం

Published Tue, Feb 5 2019 12:56 AM | Last Updated on Tue, Feb 5 2019 5:28 AM

Traffic violations are more tight - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రమాదకరంగా మారే అవకాశమున్న ఉల్లంఘనలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఐటీఎంఎస్‌) వ్యవస్థలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఐఐబీ) డేటాలతో ఆన్‌లైన్‌ అనుసంధానం ఏర్పాటు చేసుకోనున్నారు. దీంతో తీవ్రమైన ఉల్లంఘనలకు వచ్చే ఈ–చలాన్లు ‘భారీ’గా ఉండనున్నాయి. నగరంలో ప్రమాదాలు, మరణాలు తగ్గింపుతో పాటు వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. 

‘కంటి’కి చిక్కగానే అన్నీ తనిఖీ...
ఇటీవల కాలంలో నగర ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనుల గుర్తింపు కోసం కెమెరాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పాయింట్‌ డ్యూటీలో ఉండే వారి చేతిలోని కెమెరాలు, కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది సర్వైలెన్స్‌ కెమెరాలను వినియోగించి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వీరికి ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఇకపై కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది పై ‘ఆరింటికి’సంబంధించిన ఉల్లంఘనల ఫొటోలు వచ్చిన వెంటనే... ఆ వాహనం నంబర్‌ను తీసుకుంటారు. ఫొటో ఆధారంగా ఎన్ని రకాలైన ఉల్లంఘనల్ని గుర్తించవచ్చో అన్నింటినీ గుర్తిస్తారు. ఆపై వాహన నంబర్‌ ఆధారంగా ఆర్టీఏ డేటాబేస్‌లో వివిధ సర్టిఫికెట్ల వివరాలూ తనిఖీ చేస్తారు. అవి సక్రమంగా లేకుంటే ఫొటోలో ఉన్న ఉల్లంఘనలకు తోడు వీటినీ కలుపుతారు. మరోపక్క ఫొటో ఆధారంగా చోదకుడు హెల్మెట్‌ పెట్టుకున్నాడా? లేదా?, నంబర్‌ ప్లేట్‌ సక్రమంగా ఉందా? లేదా? అనేవీ పరిశీలించి ఆ ఉల్లంఘనల జరిమానానూ కలుపుతూ ఈ–చలాన్‌ పంపిస్తారు. 

ఆరింటిపై ప్రధాన దృష్టి...
ట్రాఫిక్‌ ఉల్లంఘనల్ని అధికారులు ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనం నడిపే వారికి ప్రమాదకరమైనవి, ఎదుటి వారికి ప్రమాదకరమైనవి, ఇద్దరికీ ప్రమాదకరమైనవి. నగర పోలీసులు ప్రాథమికంగా మూడో అంశంపై దృష్టి పెట్టారు. ఇందులోనూ ఆరు రకాల ఉల్లంఘనలు నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న ట్రాఫిక్‌ పోలీసులు వీటిని ‘జైలుకు తీసుకువెళ్లే’వాటి జాబితాలో చేర్చారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, సిగ్నల్‌ జంపింగ్, పరిమితికి మించి రవాణా, అతి వేగం, లైసెన్సు లేకుండా డ్రైవింగ్, నో ఎంట్రీ/రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడితే.. మేజిస్ట్రేట్‌ ముందు వాహనంతో సహా హాజరుపరుస్తారు. అలా కాకుండా కెమెరాకు చిక్కితే ‘భారీగా వడ్డించా’లని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఆ రెండింటితోనూ అనుసంధానం...
అనేక మంది వాహనచోదకులు ఆర్సీపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్ప.. ఇన్సూరెన్స్, పొల్యూషన్‌ టెస్ట్‌ వంటివి పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టుకున్నప్పుడు ‘ఫైన్‌’గా వెళ్లిపోతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్‌ విభాగం ఆర్టీఏ, ఐఐబీలతో అనుసంధానంగా ఆన్‌లైన్‌ కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న కాలుష్య తనిఖీ యంత్రాలను ఆర్టీఏతో ఆన్‌లైన్‌లో కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే తనిఖీ చేయించుకున్న ప్రతి వాహనం వివరాలు ఆర్టీఏ డేటాబేస్‌లోకి చేరుతుంది. మరోపక్క రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్సూరెన్స్‌ కంపెనీలన్నీ తమ సమాచారాన్ని గచ్చిబౌలిలో ఉన్న ఐఐబీకి సమర్పిస్తాయి. ఈ డేటా ఆధారంగా వాహన బీమా వివరాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ డేటాల అనుసంధానంతో భవిష్యత్తులో ఉల్లంఘనలకు పాల్పడే వారికి  జరిమానాల వడ్డనకు ఆస్కారం ఏర్పడనుంది. 

క్రమశిక్షణ పెంపొందించేందుకే..
వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెరిగితే ట్రాఫిక్‌ పోలీసులతో సంబంధం లేకుండా అంతా ఎవరికి వారే నిబంధనలు పాటిస్తారు. దీంతో ప్రమాదాలు, మరణాలే కాకుండా ట్రాఫిక్‌ అంతరాయాలూ తగ్గుతాయి. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన ఉల్లంఘ నలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రయోగాత్మక వినియోగం జరుగుతోంది. గరిష్టంగా మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నాం.
– ట్రాఫిక్‌ అధికారులు
   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement