స్టాక్ మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. డెట్ ఫండ్స్‌కూ ఆదరణ పెరుగుతూ వస్తోంది. అయితే, పెట్టుబడులు పెట్టేయడంతోనే బాధ్యత అయిపోయిందనుకోవడం సరికాదు. ఓ ఇన్వెస్టర్‌గా చట్టపరంగా మీకుండే హక్కులు, బాధ్యతల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రతీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలపై అందిస్తున్న ప్రాఫిట్ కథనం ఇది.
కేవైసీ కాంప్లియంట్
ప్రతీ ఇన్వెస్టర్ కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను పూర్తి చేయడం తప్పనిసరి. నల్లధనానికి చెక్ పెట్టడం, చట్టవిరుద్ధమైన నిధులు ఫండ్స్‌లోకి రాకుండా అడ్డుకోవడమే ఈ నిబంధనల ఉద్దేశ్యం. కేవైసీ కింద ఇన్వెస్టర్ గుర్తింపునకు సంబంధించి చెల్లుబాటయ్యే ఓ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, చిరునామా ధ్రువీకరణ, ఓ పాస్‌పోర్ట్ సైజు ఫొటో కూడా ఇవ్వాలి.
గుర్తింపు, చిరునామా ధ్రువీకరణకు పాస్‌పోర్ట్, పాన్, వోటర్ ఐడీ చెల్లుబాటవుతాయి. పైగా ఆధార్‌ను ఇతర అన్ని కేవైసీ పత్రాలతో అనుసంధానం చేయాలి. ఏ ఇన్వెస్టర్ అయినా గానీ కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల వద్ద తమ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయించుకుంటే, ఆతర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని పెట్టుబడుల్లోనూ ఆ మేరకు ఆటోమేటిక్‌గా మార్పులు జరిగిపోతాయి.
వ్యక్తిగత సమాచారం
ప్రతీ ఇన్వెస్టర్ కూడా తనకు సంబంధించి సంప్రదింపులకు వీలుగా చిరునామా, కాంటాక్టు నంబర్లు, ఈమెయిల్ ఐడీ, పాన్, ఒక బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి. అంతేకాదు, వీటిలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఆ సమాచారాన్ని వెంటనే ఆయా ఫండ్ సంస్థలకు తెలియజేయడం ప్రతీ ఇన్వెస్టర్ బాధ్యతే. బ్యాంకు ఖాతాకు సంబంధించి ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్, 9 అంకెల ఎంఐసీఆర్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మోసాల నివారణకు వీలుగా ఈ కీలక సమాచారం ఫండ్స్ సంస్థలకు తెలియజేయడం అవసరం.
నామినేషన్
ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ప్రతీ ఇన్వెస్టర్ కనీసం నామినీగా ఒక్కరి పేరును అయినా సూచించాలి. లేదంటే ఎవరినీ నామినీగా నియమించడం ఇష్టం లేదని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్‌గా ఏదైనా జరిగితే నామినేషన్ అక్కరకు వస్తుంది.
పరిశీలిస్తూ ఉండాలి...
తాము పెట్టుబడి పెట్టిన పథకాల పనితీరు ఎలా ఉన్నదీ అప్పడప్పుడూ పరిశీలిస్తూ ఉండడం అవసరం. ఇందుకు సంబంధించి ఆయా ఫండ్ పథకాల ఎన్‌ఏవీ చూస్తే తెలిసిపోతుంది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే రోజువారీ, ప్రతీ వారం రాబడులు ఎలా ఉన్నదీ చూసుకోవాల్సిన అవసరం లేదు.
క్రమం తప్పకుండా నెలకోసారి రాబడులను సమీక్షిస్తూ వెళితే సరిపోతుంది. మరీ తరచుగా కాకపోయినా మధ్య మధ్యలో ఆయా పథకాల పనితీరు ఎలా ఉన్నదీ గమనించడం అవసరమే. దీనివల్ల మార్కెట్ల పని తీరుకు అనుగుణంగా ఆయా పథకాల పనితీరు ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. అవసరమైతే పెట్టుబడుల్లో మార్పులు కూడా చేసుకోవచ్చు.
ఆర్థిక ప్రణాళిక
ఆర్థిక ప్రణాళిక వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ప్రతీ ఇన్వెస్టర్ గుర్తుంచుకోవాలి. కుటుంబ భవిష్యత్తు అవసరాలు, కీలకమైన ఆర్థిక లక్ష్యాలు, ఇందులో స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక అవసరాలు ఏవి, ఇందుకోసం ఎంచుకోవాల్సిన సాధనాలు, అస్సెట్ అలోకేషన్ తదితర వివరాలతో ప్రణాళిక ఉండాలి.
అలాగే, ఆదాయం, ఖర్చులు, ఎంత మేర పెట్టుబడులకు కేటాయించాలి, ఇందుకోసం అందుబాటులో ఉన్న వనరులు ఇలా అన్ని వివరాలు సమగ్రంగా ఉండాలి. అలాగే, అత్యవసరాల్లో ఆదుకునే నిధి కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, సరిపడా జీవిత బీమా కవరేజీ కూడా తీసుకోవాలి. వీటిని క్రమానుగతంగా సమీక్షిస్తూ అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం కూడా అవసరమే.
ఆధార్, ఫ్యాక్టా
ప్రతీ వ్యక్తి తమ పేరిట ఉన్న అన్ని రకాల పెట్టుబడులకు ఆధార్ నంబర్‌తో ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది కేంద్ర సర్కారు. అలాగే, విదేశీ పన్ను చట్టం (ఫ్యాక్టా) నిబంధనలనూ అనుసరించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment