వాణిజ్య స్థలం కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: రూ.1,000, రూ.500 నోట్ల రద్దు, స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు, వస్తు సేవల పన్ను వంటి రకరకాల కారణాలతో దేశంలో వాణిజ్య స్థలాల ధరలు కొంతమేర తగ్గాయని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కమర్షియల్ ప్రాపర్టీల్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంటిపై వచ్చే అద్దెతో పోలిస్తే వాణిజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8–11 శాతం వరకు అద్దె గిట్టుబాటవుతుంది కూడా.
కమర్షియల్ ప్రాపర్టీల్లో స్థలం కొనుగోలు చేసిన తర్వాత దాన్ని విక్రయించగానే మెరుగైన ఆదాయం వస్తుంది. ఇదొక్కటే కాదు ప్రతి నెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అందుకే పెట్టుబడిదారులెవరైనా సరే పెట్టుబడుల కోసం ముందుగా చూసేది కమర్షియల్ ప్రాపర్టీలనే. కాకపోతే అన్ని విధాల అభివృద్ధికి ఆస్కారమున్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.
ఇవే కీలకం..
♦ వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.
♦ ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి.
♦ భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.
♦ మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగడానికి ఆస్కారముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.
♦ మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.
♦ వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.