త్వరలో ఐఆర్‌సీటీసీ ఐపీఓ
• మరో రెండు రైల్వే పీఎస్‌యూలు కూడా
• మర్చంట్ బ్యాంకర్ల కోసం కసరత్తు
న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన మూడు సంస్థలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా రైల్వేలకు చెందిన మూడు సంస్థలు–ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఐఆర్‌సీఓఎన్‌లను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దీంట్లో భాగంగా ఈ మూడు సంస్థలు త్వరలో ఐపీఓకు రానున్నాయి. ఈ మూడు సంస్థల్లో కొంత, కొంత వాటాలను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా విక్రయించనున్నారు.
ఈ ఐపీఓలకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)లను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. సంబంధిత సంస్థలు వచ్చే నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని దీపం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్) పేర్కొంది. ప్రతి సంస్థలో ప్రభుత్వానికి వంద శాతం చొప్పున వాటాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిల్లో రూ.46,500 కోట్లు మైనారిటీ వాటా విక్రయం ద్వారా, 11,000 కోట్లు వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా సమీకరిం చాలనేది మోదీ సర్కారు యోచన.