న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ముకేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ – ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం ఇటీవలే కుదిరింది.
స్కూల్లో తనతో కలసి చదువుకున్న వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం ఈ ఏడాది డిసెంబర్ నెల మొదట్లో జరగనుంది. కాగా తాజా వార్తకు సంబంధించి ఈ మెయిల్‌కు పిరమల్ గ్రూప్ స్పందించలేదు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఆనంద్, ఇషాలు చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారు. వారి కుటుంబాల మధ్య కూడా దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి.
మహాబలేశ్వర్‌లో పెళ్లి ప్రతిపాదన...
ఉన్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం– మహాబలేశ్వర్‌లోని ఒక దేవాలయంలో ఆనంద్ ఈ పెళ్లి ప్రతిపాదనను ఇషా ముందు ఉంచారు. ఇందుకు ఆమె అంగీకరించారు. ఈ సందర్భంగా జరిగిన ఒక విందు కార్యక్రమంలో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, ఆనంద్ తల్లిదండ్రులు అజయ్, స్వాతిలతోపాటు ఇషా నానమ్మ, అమ్మమ్మలు కోకిలాబెన్ అంబానీ, పూర్ణిమాబెన్ దలాల్, సోదరులు ఆకాశ్, అనంత్‌లు పాల్గొన్నారు. ఆనంద్ సోదరి నందిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హేమాహేమీలు...
కేవలం ప్రముఖ వ్యాపారస్తుల సంతానమే కాకుండా, వ్యాపారాల్లో ఆనంద్, ఇషాలు తమకంటూ ఇప్పటికే ప్రత్యేకతలను సంపాదించుకున్నారు. ఆనంద్ పెన్షిల్వేనియా యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో బ్యాచులర్ డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. పిరమల్ రియల్టీని నెలకొల్పారు. అంతక్రితం గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఆయన పిరమల్ స్వస్థాయను కూడా స్థాపించారు.
పిరమల్ గ్రూప్‌లో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఇషా విషయానికి వస్తే, రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లలో బోర్డ్ సభ్యురాలిగా ఉన్నారు. రిలయన్స్ జియో విజయానికి ప్రధాన కారకుల్లో ఆమె కూడా ఒకరని స్వయంగా ముకేశ్ అంబానీనే ఇటీవల పేర్కొనడం గమనార్హం. యేల్ యూనివర్సిటీలో ఆమె సైకాలజీ చేశారు. జూన్‌కల్లా ఆమె గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, స్టాన్‌ఫార్డ్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment