ఐటీ ఉద్యోగుల ఉద్వాసన! రియల్టీపై ప్రభావం ఉంటుందా? | it affect on realty | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల ఉద్వాసన! రియల్టీపై ప్రభావం ఉంటుందా?

Published Fri, May 12 2017 11:18 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

ఐటీ ఉద్యోగుల ఉద్వాసన! రియల్టీపై ప్రభావం ఉంటుందా? - Sakshi

ఐటీ ఉద్యోగుల ఉద్వాసన! రియల్టీపై ప్రభావం ఉంటుందా?

నగరంలో నివాస, కార్యాలయాల స్థలాల కొనుగోళ్లలో ఐటీదే హవా
60 శాతం నివాసాల కొనుగోళ్లు; 75 శాతం ఆఫీసు స్పేస్‌ లీజులు వీరివే 
దీర్ఘకాలంలో లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలపై ప్రభావం
నాణ్యమైన నిర్మాణాలు, అందుబాటు ధరల్లోని ప్రాజెక్ట్‌లకైతే నో ప్రాబ్లం 
రూ.60 లక్షల్లోపు ఫ్లాట్లకు మాత్రం తగ్గని గిరాకీ


మొన్నటివరకు రూ.1,000, రూ.500 నోట్ల రద్దు నిన్నటివరకూ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లులోని నిబంధనలు మరిప్పుడో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగుల తొలగింపులు ఇక రేపో.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు! .. ఇవీ దేశీయ స్థిరాస్తి రంగాన్ని ఒకదాని వెంట మరోటి వెనక్కి లాగేస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: నిజం చెప్పాలంటే భాగ్యనగరిలో నివాస, కార్యాలయాల స్థలాల కొనుగోళ్లలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగులు, కంపెనీల వాటా ఎక్కువ. మరి, తాజా ఐటీ ఉద్యోగుల తొలగింపులు స్థిరాస్తి అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తుందా? లక్షల్లో వేతనాలు, పెద్ద మొత్తంలో గృహ రుణాలకు అర్హత ఉండటంతో ఇన్నాళ్లూ రియల్టీలో పెట్టుబడులు పెట్టిన వీరంతా ఇప్పుడు డోలాయమానంలో పడతారా? ఐటీ ఉద్యోగులు, కంపెనీలే లక్ష్యంగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించే నిర్మాణ సంస్థల పరిస్థితేంటి? వంటి సందేహాలను ‘సాక్షి రియల్టీ’ పలువురు నిర్మాణ నిపుణులతో చర్చించింది. వారి అభిప్రాయాల సమాహారమే ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనం!

బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో రెండో అతిపెద్ద నగరం హైదరాబాదే. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్, సైయంట్, క్యాప్‌జెమినీ, డెలాయిట్‌ వంటి 1,500ల కంపెనీలు, వీటిల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులుంటారు. అయితే గత కొంతకాలంగా రకరకాల కారణాలతో వివిధ ఐటీ కంపెనీలు సుమారు 4 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఐటీ ఉద్యోగుల తొలగింపు ప్రభావం మొట్ట మొదటగా పడేది స్థిరాస్తి రంగంపైనే. ఎందుకంటే లక్షల్లో వేతనాలు, పెద్ద మొత్తంలో గృహ రుణాల అర్హత, ఏటేటా పెరిగే అద్దెలు వంటి వాటితో ఇళ్ల కొనుగోళ్లు, పెట్టుబడులు పెట్టేది వీళ్లే మరి.

రెండో ఇళ్ల కొనుగోళ్లు, పెట్టుబడులపై ప్రభావం..
హైదరాబాద్‌లో రూ.25 లక్షల నుంచి కోట్లాది రూపాయల వరకూ ప్రాజెక్ట్‌లుంటాయి. వీటిని స్థిర నివాసం కోసం, అద్దెల కోసం, పెట్టుబడుల రీత్యా కొనుగోలు చేస్తుంటారు. నగరంలో నివాస సముదాయాల కొనుగోళ్లు, పెట్టుబడుల్లో ఐటీ  ఉద్యోగుల వాటా 60 శాతం వరకుంటుందని నైట్‌ఫ్రాంక్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ సామ్సన్‌ ఆర్థూర్‌ తెలిపారు. వాణిజ్య సముదాయాల విషయానికొస్తే.. గతేడాది నగరంలో 60 లక్షల చ.అ. విక్రయం కాగా.. 75–80 శాతం ఐటీ కంపెనీలే కొనుగోలు/లీజుకు తీసుకున్నాయని చెప్పారు.

అయితే తాజాగా ఐటీ ఉద్యోగుల తొలగింపు పరిణామం నగర స్థిరాస్తి రంగంపై వెంటనే ప్రభావం చూపించకపోయినా.. దీర్ఘకాలంలో ఇబ్బందులుండే ప్రమాదముందని హెచ్చరించారు. స్థిర నివాస కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం ఉండదని.. రెండో ఇళ్ల కొనుగోళ్లు, స్థిరాస్తి పెట్టుబడులపై కాసింత ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఎందుకంటే ఉద్యోగాలకే భద్రత లేని ఇలాంటి తరుణంలో గృహ రుణం తీసుకునే సాహసం చేయకపోవచ్చనేది సామ్సన్‌ అభిప్రాయం.

వెస్ట్‌ జోన్‌లో 80 శాతం..
ఐటీ ఉద్యోగుల తొలగింపు ప్రభావం బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో కాసింత తక్కువగానే ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) తెలంగాణ ప్రెసిడెంట్‌ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఉద్యోగులతో పాటూ ఫార్మా ఉద్యోగులు, ప్రవాసులు, వ్యాపారస్తులూ ఎక్కువగా ఉండటమేనని పేర్కొన్నారు. ఈమధ్య కాలంలో ఆఫీసు స్థలాల లీజుల్లో ఐటీ కంపెనీలతో పోటీగా స్టార్టప్స్, ఈ–కామర్స్‌ సంస్థలూ ఉంటున్నాయని.. ఇది నిర్మాణ సంస్థలకు కలిసొచ్చే అంశమని చెప్పారు.

అందుబాటు ధరల్లో, నాణ్యమైన నిర్మాణాలు, గడువులోగా నిర్మాణం పూర్తి చేసే పేరున్న నిర్మాణ సంస్థలకు అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేశారు. నగరంలో నివాస సముదాయాల కొనుగోళ్లలో ఐటీ, ఇతర ఉద్యోగుల వాటా ఒక్కో ప్రాంతాల్లో ఒక్కోలా ఉంటాయి. అప్పా జంక్షన్‌లో 40:60 శాతంగా, ఈస్ట్‌ జోన్‌లో 30:70 శాతంగా ఉంటాయి. వెస్ట్‌ జోన్‌లో అత్యధికంగా 80:10 శాతంగా ఉంటుందని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఐటీ కంపెనీలు కొలువుదీరిన గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, నానక్‌రాంగూడ, నార్సింగి, మణికొండ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, పోచారం వంటి ప్రాంతాల్లో ఆయా ఉద్యోగుల కొనుగోళ్లు ఎక్కువగానే ఉంటాయి.
5 వేల మందిని తొలగిస్తే..

40 వేల మందిని నియామకం..
నగరంలో స్థిరాస్తుల కొనుగోళ్లలో ఐటీ ఉద్యోగుల వాటా ఎక్కువే అయినా.. గత కొంత కాలంగా వాళ్లు కేవలం వేతనాల మీద ఆధారపడి కొనుగోళ్లు చేయట్లేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందస్తు పొదుపు ప్రణాళికలు చేపట్టి మరీ కొంటున్నారని రామ్‌ డెవలపర్స్‌ సీఎండీ రాము వనపర్తి తెలిపారు. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలపై కొంత ప్రభావాన్ని చూపించినా.. ఆయా నిర్మాణాల వాటా నగరంలో తక్కువేనని చెప్పారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రూ.60 లక్షల్లోపు ఫ్లాట్లపై ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఉందని తేల్చి చెప్పారు.

‘‘ఐటీ కంపెనీల్లో ప్రతి ఏటా 5–10 శాతం ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణం. ఇందులోనూ ఫ్రెషర్స్, మధ్య స్థాయి ఉద్యోగులను తీసేయరు. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ లెవల్స్‌లో తొలగింపులుంటాయని’’ పలు ఐటీ కంపెనీల్లో దశాబ్ద కాలం పనిచేసి, ప్రస్తుతం డెవలపర్‌గా స్థిరపడ్డ ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కుమార్‌ కామరాజు చెప్పారు. 5 వేల మందిని తొలగిస్తే.. 40 వేల మంది కొత్త వారిని నియమించుకుంటారని.. ఇది నిర్మాణ సంస్థలకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. ప్రణీత్‌ గ్రూప్‌ కస్టమర్లలో 95 శాతం ఐటీ ఉద్యోగులే ఉంటారని గుర్తు చేశారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement