ఐటీ ఉద్యోగులకు అండ..! | IT Companies Came Forward To Support Employees Financialy | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగులకు అండ..!

Published Wed, Apr 29 2020 3:30 AM | Last Updated on Wed, Apr 29 2020 4:27 AM

IT Companies Came Forward To Support Employees Financialy - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో వేతనాల కోత ఉంటుందని చాలా మంది భావించారు. అయితే అందుకు భిన్నంగా కంపెనీలు ఏప్రిల్‌ నెలకుగాను పూర్తి స్థాయి వేతనాన్ని ఇవ్వనున్నాయి. మరి కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకేసి బోనస్, వేతనాల పెంపు ప్రకటించాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ఉద్యోగుల బ్రాడ్‌బ్యాండ్‌ ఖర్చులను భరిస్తున్న సంస్థలూ ఉండడం విశేషం. ఇంకొన్ని కంపెనీలైతే ఇన్వర్టర్ల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. పదోన్నతులు ప్రకటించిన సంస్థలూ ఉన్నాయి. ఏదైతేనేం జీతాల కోత లేకపోవడం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులకు పెద్ద ఊరట. మధ్య, పెద్ద తరహా కంపెనీల్లో పరిస్థితి ఇలా ఉంటే, సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలు, స్టార్టప్స్‌లో వేతనాల కోత ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఒక్క హైదరాబాద్‌లో ఐటీ రంగంలో 5 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.

మీకు అండగా మేము.. 
ఈ కష్ట సమయంలో మేమున్నామంటూ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు భరోసా ఇస్తున్నాయి. బ్రాడ్రిడ్జ్‌ తన సిబ్బందికి పూర్తి వేతనంతోపాటు రూ.25,000 బోనస్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫ్యాక్ట్‌సెట్‌ పూర్తి వేతనంతోపాటు బ్రాడ్‌బ్యాండ్‌ ఖర్చులు, హెచ్‌సీఎల్‌ పూర్తి వేతనంతోసహా బ్రాడ్‌బ్యాండ్‌ ఖర్చులు, ఇన్వర్టర్‌ వ్యయం భరిస్తోంది. అలైట్‌–ఎన్‌జీఏ జీతాలను పెంచుతోంది. కాగ్నిజెంట్‌ తన అసోసియేట్‌ లెవెల్‌ ఉద్యోగులకు బేసిక్‌ సాలరీ మీద 25 శాతం జీతం హైక్‌ చేస్తోంది. అమెజాన్‌ జీతాల పెంపు, పదోన్నతులు ఇస్తోంది. యాక్సెంచర్‌ పూర్తి వేతనంతోపాటు బ్రాడ్‌బ్యాండ్‌కు రూ.1,500, క్యాప్‌జెమిని పూర్తి వేతనం, బ్రాడ్‌బ్యాండ్‌కు రూ.2,000 అందిస్తోంది. ఇన్వెస్కో వేతనంతోపాటు అదనంగా రూ.4,000 అలవెన్సు జమ చేస్తోంది. ఫినాక్‌ టెక్నాలజీస్‌ అలవెన్సు ప్రకటించింది.

జీతాల కోత లేకుండా.. 
ఉద్యోగులకు జీతాల కోత లేకుండా.. పూర్తి స్థాయి వేతనం ఇస్తామంటూ పలు కంపెనీలు ప్రకటించాయి. వీటిలో జేపీ మోర్గాన్‌ ఛేస్, వెల్స్‌ ఫార్గో, బీఎన్‌వై మెలన్, బీఎన్‌పీ పారిబా, ఇంటర్‌ కాంటినెంటల్‌ ఎక్స్ఛ్‌చేంజ్, థామ్సన్‌ రాయిటర్స్, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. విప్రో ఉద్యోగులకు పదోన్నతులు, వేతనాల పెంపు లేనప్పటికీ అన్ని స్థాయిల ఉద్యోగులు విధుల్లో ఉన్నా, లేకున్నా పూర్తి వేతనం ఇస్తోంది. పైగా బ్రాడ్‌బ్యాండ్, పవర్‌ బిల్స్‌ ఖర్చులకుగాను రూ.1,500 జమ చేస్తోంది. టీసీఎస్‌ పూర్తి వేతనం ఇస్తోంది. ఉద్యోగుల కోత లేదని తెలిసింది. అయితే వేతనాల పెంపు ఇప్పట్లో లేదని సమాచారం. జెన్‌ప్యాక్ట్‌ సైతం టీసీఎస్‌ బాటలో ఉంది. ఈ ఏడాది జీతాల పెంపు, ప్రమోషన్లు లేవని సమాచారం. ఏప్రిల్‌ నెలకు పూర్తి వేతనం చెల్లిస్తోంది.

కొత్త వ్యాపార అవకాశాలు.. 
కరోనాతో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. అందుకు అనుగుణంగానే ఉన్న ఉద్యోగులను కాపాడుకుంటూ, భవిష్యత్తు అవసరాల కోసం నగదు నిల్వలను సమర్థంగా వినియోగించాలన్నది కంపెనీల భావన అని స్మార్ట్‌స్టెప్స్‌ కో–ఫౌండర్‌ లావణ్య కుమార్‌ నానబాల సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు.  ‘మధ్య, పెద్ద తరహా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి సమర్థంగా మార్చివేశాయి. మరోవైపు లాక్‌డౌన్‌తో దేశీయ, విదేశీ క్లయింట్లు కొన్ని పనిచేయడం లేదు. దీంతో రావాల్సిన చెల్లింపులు జాప్యం జరగవచ్చు. అలా జరిగితే రానున్న కాలంలో సాలరీలలో కొంత శాతం వాయిదా పడే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కరోనా విపత్తుతో ఐటీ రంగంలోని సూక్ష్మ, చిన్న కంపెనీలు, స్టార్టప్స్‌ కుదేలవుతున్న పరిస్థితి. ఇవి ఎప్పటికప్పుడు వచ్చే ఆదాయంతో నెట్టుకొస్తున్నవి. లాక్‌డౌన్‌తో ఆదాయం రాక పోగా సాలరీలు, అద్దె చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కంపెనీలన్నీ మార్చి నెల సాలరీల్లో భారీగా కోత పెట్టాయి. ఏప్రిల్‌ మాసానికి మొత్తంగా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement