
ఐటీ రిఫండ్స్ అన్నీ బ్యాంకు ఖాతాల్లోకే..!
చెల్లింపు వ్యవస్థ పై బ్యాంకులతో సంప్రదింపులు
న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులు అందరికీ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ శుభవార్తను అందిస్తోంది. పన్ను చెల్లింపుపై ఎంత రిఫండ్ అయినా... దానిని సురక్షితంగా వారి(పన్ను చెల్లింపుదారు) బ్యాంక్ అకౌంట్‌లోనే జమ చేసేలా తప్పనిసరి విధానాన్ని పాటించాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఈ అంశంలో బ్యాంకింగ్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నది ఐటీ శాఖ యోచన. రిఫండ్స్‌కు సంబంధించి పన్ను చెల్లింపుదారుల ఇబ్బందుల పరిష్కార దిశలో... ప్రాధాన్యత ప్రాతిపదికన పూర్తి స్థాయిలో ‘బ్యాంకింగ్ సేవల’ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీబీడీటీ చైర్‌పర్సన్ అనిత కపూర్ ఇటీవల పేర్కొన్నారు.
ప్రస్తుతం రూ.50,000కు పైబడిన విలువ రిఫండ్- చెక్కుల రూపంలో పోస్టల్ శాఖ ద్వారా మాత్రమే పన్ను చెల్లింపుదారుకు అందుతోంది. అంతకన్నా తక్కువ మొత్తం విషయంలో బ్యాంకుల్లో జమఅవుతోంది. ఒక్కొక్క సందర్భంలో ఈ మొత్తాలకు సంబంధించి సైతం స్పీడ్‌పోస్ట్ సేవలను పొందుతోంది. అయితే ఇకపైబ్యాంకింగ్ ద్వా రానే రిఫండ్స్ చెల్లించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బ్యాంకింగ్‌తో చర్చలు- ఇబ్బందులు..!
రిఫండ్స్ విషయంలో తరచూ కొన్ని తప్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో- ఎటువంటి లొసుగులూ లేకుండా ప్రత్యక్షంగా బ్యాంక్ అకౌంట్‌లోనే ఈ మొత్తాన్ని జమచేయడానికి సంబంధించి బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కొందరు బ్యాంకర్లను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) అధికారులు సంప్రదించినట్లు అనిత కపూర్ వెల్లడించారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం, రిఫండ్స్ విషయంలో బ్యాంకింగ్ సేవలను పొందే విషయంలో తరచుగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అకౌంట్ నంబర్ ద్వారా ప్రత్యక్షంగా రిఫండ్ జమ అవుతుంది తప్ప, అకౌంట్‌దారు పేరును ప్రస్తుత ‘ఈ-ఎన్విరాన్‌మెంట్’ సరిచూసుకోదు. ‘చాలామంది పన్ను చెల్లింపుదారులు తమ అకౌంట్ నంబర్‌ను ఒక్కోసారి తప్పుగా రాసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే నంబర్‌కు రిఫండ్ చెక్కు జారీ చేస్తే- ఆ చెక్కుకు సంబంధించి పేరును అకౌంట్ నంబర్‌తో బ్యాంకింగ్ వ్యవస్థ సరిచూసుకోదు. అకౌంట్ నంబర్ తప్పు అయిన ఒక్కొక్క సందర్భంలో... పన్ను చెల్లింపుదారుడు మరింత ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంది’ అని సీబీడీటీ చైర్‌పర్సన్ పేర్కొన్నారు. అందుకే బ్యాంకింగ్ అకౌం ట్‌ను.. పేరుతో సరిపోల్చే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థ ఏర్పడిన తరువాత ఇకపై ఎంత మొత్తమైనా ఎలాంటి లొసుగులకూ తావులేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమయ్యే విధానం అమలవుతుందని తెలిపారు.