
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగిత పెరిగిపోయిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో గత ఐదేళ్లలో కొత్తగా 8.73 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 41.40 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 1.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని తెలిపారు. ‘నేను నా సొంత డేటా బట్టి చెప్పడం లేదు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నాను. ఉద్యోగాల గణాంకాలపై కాంగ్రెస్ అన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. నేను వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నాను‘ అని ఆయన వివరించారు.
నిరుద్యోగిత సంక్షోభం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్... తమ పదేళ్ల హయాంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించగలిగిందో చెప్పాలన్నారు. గడిచిన కొన్నాళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు పుంజుకోవడంతో.. గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని మంత్రి చెప్పారు. ‘దేశ ఎకానమీ 7.4% పైగా వృద్ధి సాధిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. తయారీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. అలాగే అంతర్జాతీయంగా భారత ఎకానమీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. వీటన్నింటి ఫలితంగా మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతోంది‘ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment