న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,955 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.2,640 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, సిగరెట్లు, వ్యవసాయ, పేపర్ విభాగాలు మంచి వృద్ధి సాధించాయని కంపెనీ తెలియజేసింది. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.10,258 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.11,777 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6,314 కోట్ల నుంచి రూ.7,408 కోట్లకు చేరాయి.
ప్రతికూలతలున్నా... మంచి పనితీరు...
సిగరెట్ పరిశ్రమపై తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతుండటం, వ్యాపార పరిస్థితులు సమస్యాత్మకంగా ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ, మంచి పనితీరు సాధించామని ఐటీసీ తెలిపింది. వివిధ విభాగాల పనితీరును చూస్తే... ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారం (సిగరెట్ల విభాగంతో కలుపుకొని) ఆదాయం రూ.7,358 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.8,186 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
మొత్తం ఆదాయంలో 45 శాతం వాటా ఉండే సిగరెట్ల విభాగం వ్యాపారం రూ.4,554 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.5,026 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలియజేసింది. ఎఫ్‌ఎమ్‌సీజీ–యేతర వ్యాపార విభాగం రూ.2,804 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.3,160 కోట్లకు ఎగసిందని తెలిపింది. వ్యవసాయ విభాగం ఆదాయం రూ.1,968 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,220 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐటీసీ షేర్లు 2.3 శాతం నష్టంతో రూ.281 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment