న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.2,640 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.2,500 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది.
అయితే అధిక పన్నుల భారం కారణంగా సిగరెట్ల సెగ్మెంట్‌పై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. గత క్యూ2లో సిగరెట్ల సెగ్మెంట్ ఆదాయం రూ.8,528 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో 47 శాతం తగ్గి రూ.4,554 కోట్లకు తగ్గిందని తెలిపింది. జీఎస్‌టీ కారణంగా అధిక పన్నుల భారం పడటంతో సిగరెట్ల వ్యాపారం ఆదాయం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది.
మొత్తం ఆదాయం గత క్యూ2లో రూ.14,092 కోట్లుగా, ఈ క్యూ2లో రూ.10,258 కోట్లుగా నమోదైందని పేర్కొంది. జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన కారణంగా గత క్యూ2 మొత్తం ఆదాయాన్ని ఈ క్యూ2 మొత్తం ఆదాయంతో పోల్చడానికి లేదని వివరించింది.
ఎఫ్‌ఎంసీజీ ఆదాయం డౌన్....
కాగా, వ్యయాలు గణనీయంగా తగ్గడం కంపెనీకి కలసివచ్చింది. గత క్యూ2లో రూ.10,266 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ2లో రూ.6,314 కోట్లకు తగ్గాయి. సిగరెట్లు, ఇతరాలతో కూడిన ఎఫ్‌ఎంసీజీ వ్యాపార ఆదాయం రూ.11,200 కోట్ల నుంచి రూ.7,358 కోట్లకు తగ్గింది.
హోటల్ వ్యాపార ఆదాయం మాత్రం రూ.297 కోట్ల నుంచి రూ.300 కోట్లకు, వ్యవసాయ విభాగ ఆదాయం రూ.1,880 కోట్ల నుంచి రూ.1,968 కోట్లకు పెరిగాయి. ఇక పేపర్‌బోర్డ్‌లు, పేపర్, ప్యాకేజింగ్ వ్యాపారం రూ.1,331 కోట్ల నుంచి రూ.1,309 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేర్ 0.3 శాతం క్షీణించి రూ.269 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment