జేఎల్‌ఆర్ స్మార్ట్ కార్లు వస్తున్నాయ్..!
సెల్ఫ్ లెర్నింగ్ టెక్నాలజీ
డ్రైవ్ చేసే వ్యక్తి స్వభావాన్ని బట్టి ఆటోమేటిక్ మార్పులు
దుబాయ్: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) కంపెనీ స్మార్ట్ కార్లను డెవలప్ చేస్తోంది. సెల్ఫ్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా డ్రైవర్ల దృష్టి రోడ్డు మీదనుంచి మళ్లించకుండా ఏకాగ్రతగా డ్రైవ్ చేసేలా ఒక అల్గారిథమ్‌ను జేఎల్‌ఆర్ రూపొందిస్తోంది. తద్వారా యాక్సిడెంట్లను నివారించేలా ఈ కార్లను తయారు చేయనున్నామని జేఎల్‌ఆర్ డెరైక్టర్(రీసెర్చ్ అండ్ టెక్నాలజీ) వోల్ఫ్‌గాంగ్ ఈపిల్ చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నిక్‌ల ద్వారా ఈ స్మార్ట్ కార్లను రూపొం దిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సెల్ఫ్ లెర్నింగ్ కార్ రీసెర్చ్ అంతా ట్రాఫిక్, నావిగేషన్ అంచనాలకే పరిమితమైందని పేర్కొన్నారు. దీనిని తాము ఒక మెట్టు పైకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ సెల్ఫ్ లెర్నింగ్ డ్రైవింగ్‌తో డ్రైవింగ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రత్యేకతలు ఇవీ....
కారును డ్రైవ్ చేసే వ్యక్తి కారులోకి ప్రవేశించగానే అతడి దగ్గరున్న స్మార్ట్‌ఫోన్ ద్వారా గానీ, ఇతర డివైస్‌ల ద్వారా గానీ ఆ వ్యక్తి డ్రైవింగ్ పోకడలు, ప్రాధాన్యతలను ఈ స్మార్ట్ కారులోని కొత్త అల్గారిథమ్ గుర్తిస్తుంది. ఆ వ్యక్తి కారు ఎలా నడుపుతున్నాడు. డ్రైవింగ్ అలవాట్లు, పోకడలు ఎలా ఉన్నాయి. ఎప్పుడు కారు అద్దాలను ఎలా మారుస్తున్నాడు, స్టీరింగ్, సీట్లను ఎంత ఎత్తుకు అడ్జెస్ట్ చేస్తున్నాడు... తదితర అంశాలను ఈ అల్గారిథమ్ పసిగట్టగలుగుతుంది. దీనికనుగుణంగానే కారు అద్దాలను, స్టీరింగ్ వీల్‌ను, సీటింగ్ సెట్టింగ్‌లను ఆటోమాటిక్‌గా సెట్ చేస్తుంది.
సాధారణంగా చాలా మంది డ్రైవర్లు ఫోన్ లిస్ట్ చెక్ చేస్తునో, కారు డోర్ల అద్దాలను సరి చేస్తూనో, స్టీరింగ్ వీల్‌ను, సీట్లను అడ్జెస్ట్ చేస్తూనో ఏమరుపాటుగా డ్రైవ్ చేస్తుంటారు. ఈ కొత్త అల్గారిథమ్ కారణంగా ఈ ఏమరుపాటు ఉండదు. ఫలితంగా ప్రమాదాలు తప్పుతాయి. మొత్తం మీద కారును నడిపే వ్యక్తి రోడ్డు మీదనే దృష్టి కేంద్రీకరించేలా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఒక వేళ బయట మంచు పడుతుంటేనో, వర్షం కురుస్తుంటేనో, దీనికి తగ్గట్లుగా క్యాబిన్‌లోని ఉష్ణోగ్రతను మార్పు చేయగలదు కూడా.
ఇక కారులో ఉండే స్మార్ట్ అసిస్టెంట్ ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన ఆ రోజు షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా నావిగేషన్‌ను ప్రి-సెట్ చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఆ వ్యక్తి తర్వాత వెళ్లాల్సిన గమ్యాన్నీ ఇది ముందే గుర్తిస్తుంది. దానికి తగ్గట్లుగా కారులో వాతావరణాన్ని మారుస్తుంది. ఒకవేళ మీరు జిమ్‌కు వెళ్లాలనుకుంటున్నారనుకోండి. దానికి తగ్గట్లుగా కారులో ఉష్ణోగ్రతను కొంచెం పెంచుతుంది. ఒక వేళ ఇంటికి వెళుతున్నారనుకోండి.. కూల్‌గా ఉండడం కోసం ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.