ముగ్గురు ఆపరేటర్లకు అనుకూలంగా ‘సీఓఏఐ’
సంఘాన్ని సంస్కరించాల్సిందే: రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: ప్రత్యర్థులపై రిలయన్స్ జియో మరోమారు సంచలన ఆరోపణలతో విరుచుకుపడింది. రిలయన్స్ జియో సహా ప్రధాన టెలికం అపరేటర్లతో కూడిన ‘సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ)’పై ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. సీఓఏఐ నిబంధనలు, ఓటింగ్ హక్కులు పూర్తిగా ఏకపక్షం, లోపభూయిష్టమని, ముగ్గురు ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా స్వార్థ ప్రయోజనాల కోసం రూపొందించినవని జియో వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఓటింగ్ విధానంతో సహేతుకత, నిష్పాక్షికత, జవాబుదారీతనం, పారదర్శకతకు చోటు లేదని, ఈ నిబంధనల్ని సమూలంగా సంస్కరించాలని జియో డిమాండ్ చేసింది.
ఓటింగ్ హక్కులు ప్రధాన ఆపరేటర్లకు అనుకూలంగా ఉండడంతో వారు ఎలాంటి నిర్ణయాలనైనా నిర్దేశించగలుగుతున్నారని, ప్రభావితం చేయగలుగుతున్నారని పేర్కొంది. ముగ్గురు ఆపరేటర్లు ఆదాయాల పరంగా 60.84 మార్కెట్ వాటాతో 7 ఓట్ల చొప్పున 21 ఓట్లు కలిగి ఉన్నారని... ఇదే సంఘంలో ఉన్న మరో నలుగురు ఆపరేటర్లకు (జియో సహా) 10 ఓట్లు మాత్రమే సర్దుబాటు చేశారని జియో పేర్కొంది. సత్వరమే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసి సీఓఏఐ నిబంధనల సవరణ, దిద్దుబాటును చేపట్టాలని, భవిష్యత్తులో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా చూడాలని డిమాండ్ చేసింది.