సాక్షి, ముంబై : ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కు జాక్ పాట్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం గ్లోబల్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కొటక్ బ్యాంకులో భారీస్థాయి పెట్టుబడులకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10శాతం వాటాను కొనుగోలు చేయనున్నారన్న వార్తలు శుక్రవారం నాటి మార్కెట్ లో హల్ చల్ చేశాయి.
400-600 కోట్ల డాలర్లు పెట్టుబడులు
కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో అమెరికన్ దిగ్గజం వారెన్ బఫెట్ సంస్థ బెర్కషైర్ హాథవే 4-6 బిలియన్ డాలర్లను(రూ. 28,000-42,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. బ్యాంకులో 10 శాతం వాటాను కొనుగోలు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమోటర్ వాటా నుంచి లేదా ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌కింద వాటాను సొంతం చేసుకోనున్నట్లు మీడియా పేర్కొంది. బ్యాంకులో ప్రస్తుతం ఉదయ్ కొటక్‌కు 29.73 శాతం వాటా ఉండగా, మొత్తం ప్రమోటర్ గ్రూప్‌నకు 30.02 శాతం వాటా ఉంది.
కొటక్ వివరణ
అయితే ఈ వార్తలను కొటక్ మహీంద్రా యాజమాన్యం తిరస్కరించింది. దీనికి సంబంధించి నివేదించడానికి తమ దగ్గర సమాచారం ఏమీ లేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మరోవైపు వారెన్ బఫెట్ కొనుగోలు వార్తలతో ఇన్వెస్టర్లు కొటక్ మహీంద్రా షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దాదాపు 10 శాతం జంప్‌చేసి, కంపెనీ వివరణ అనంతరం 7శాతం లాభాలకు పరిమితమైంది.
కాగా రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఈ డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను 20 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు కొటక్ మహీంద్రాను ఇప్పటికే ఆదేశించింది. అలాగే 2020 మార్చి 31 నాటికి 15 శాతానికి ప్రమోటార్ల వాటాను తగ్గించుకోవాలని కూడా ఆర్‌బీఐ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment