ఈ మ్యూచువల్ ఫండ్ పథకం ఎక్కువగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మార్కెట్ల ర్యాలీ సమయాల్లో లాభాలను ఒడిసి పట్టుకోవటానికి మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది. మార్కెట్లు బాగా పెరిగి కరెక్షన్‌కు గురయ్యే సమయంలో రిస్క్ తగ్గించేందుకు, పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోకుండా కాపాడేందుకు డెట్ సాధనాల్లో ఎక్స్‌పోజర్ పెంచుకోవడం, నగదు నిల్వలు పెంచుకోవడం చేస్తుంటుంది. మోస్తరు రిస్క్ భరించగలిగే వారు, కనీసం 5–7 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయగలిగిన వారు పెట్టుబడులు పెట్టేందుకు ‘కోటక్ సెలక్ట్ ఫోకస్ ఫండ్’ను పరిశీలించొచ్చు.
పనితీరు ఎలా ఉందంటే...
దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు ఆశాజనకంగా ఉంది. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో మెరుగైన రేటింగ్ విషయంలో గత ఐదు సంవత్సరాలుగా చోటు సంపాదించుకుంది. రాబడుల విషయంలో బెంచ్‌మార్క్ కంటే మెరుగ్గా ఉంది. ఈ పథకం రాబడులకు నిఫ్టీ 200 బెంచ్‌మార్క్‌గా ఉంది. మూడు, ఐదేళ్ల కాలంలో చూస్తే బెంచ్‌మార్క్ కంటే 4–7 శాతం అధిక రాబడులు, ఈ విభాగం మొత్తం రాబడులతో పోల్చి చూసుకుంటే 4–6 శాతం రాబడులు అధికంగా ఇచ్చింది. అయితే గత ఏడాది కాలంలో రాబడులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మిడ్‌క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేయడం, ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఉండడం కారణం.
పోర్ట్‌ఫోలియో ఇదీ..: ప్రస్తుతం ఈ పథకం 85–90 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులో అధిక పెట్టుబడులు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు కేటాయింపులు ఎక్కువగా చేసింది. బ్యాంకింగ్ రంగంలో 22 శాతం, ఫైనాన్షియల్ సెక్టార్‌లో 12 శాతం ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 8 శాతం పెట్టుబడులు ఉన్నాయి.
ఎంఆర్‌ఎఫ్, మారుతి సుజుకి, బ్రిటానియా, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టాక్స్ ఈ పథకానికి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఇవి గడిచిన ఏడాది కాలంలో 20–50 శాతం వరకు ర్యాలీ చేశాయి. సన్‌ఫార్మా, టాటా మోటార్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 20– 25 శాతం వరకు తగ్గిపోవడం పథకం రాబడులపై ప్రభావం చూపింది. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, బాటా ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్స్ ఇటీవల పోర్ట్‌ఫోలియోలోకి కొత్తగా వచ్చి చేరాయి. సగటు కంటే ఎక్కువ రాబడులు ఆశించే వారికి అనువైన పథకం ఇది.
- (సాక్షి, బిజినెస్ విభాగం)
Comments
Please login to add a commentAdd a comment