
సేవలపై మరో అర శాతం పన్ను బాదుడు
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులు, ప్రయాణ చార్జీలు, బ్యాంకింగ్ ఇతరత్రా అనేక సేవలు ఇకపై మరింత భారం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన 0.5 శాతం కృషి కళ్యాణ్ సెస్ రేపటి నుంచి(జూన్ 1) అమల్లోకి రానుండటమే దీనికి కారణం. పన్నుల పరిధిలో ఉన్న అన్ని సేవలపై అదనంగా ఈ అర శాతం పన్నును వడ్డిస్తారు. దీంతో ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న సేవల పన్ను 15 శాతానికి పెరగనుంది.
వాస్తవానికి అంతక్రితం 12.36 శాతంగా ఉన్న సేవల పన్నును 2015 జూన్ 1 నుంచి 14 శాతానికి పెంచారు. దీనికి నవంబర్ 15, 2015 నుంచి మరో అర శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను జోడించడంతో సేవా పన్ను 14.5 శాతానికి చేరింది. ఇప్పుడు కృషి కళ్యాణ్ సెస్ అర శాతం కూడా జతయ్యి 15 శాతానికి చేరనుంది. మొత్తంమీద త్వరలో అమల్లోకి తీసుకురానున్న ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేటు(17-18 శాతం ఉండొచ్చని అంచనా) స్థాయికి నెమ్మదినెమ్మదిగా కేంద్రం సేవల పన్నును పెంచుకుంటూ వస్తోంది.