ఎల్ అండ్ టీ లాభం 29 శాతం అప్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 29.5 శాతం వృద్ధిచెంది రూ. 3,025 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 2,335 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ స్థూల ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 36,828 కోట్లకు పెరిగినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను (2 షేర్లకు ఒక బోనస్ షేరు) సిఫార్సుచేసింది.
కొత్త ఆర్డర్ల విలువ చూస్తే..
2017 మార్చి క్వార్టర్లలో తమకు రూ. 47,289 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని, ఆర్డర్ ఫ్లో 9 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ. 9,044 కోట్లు వుంది. దీంతో తమ కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 5% వృద్ధితో రూ. 2,61,341 కోట్లకు చేరినట్లు కంపెనీ వివరించింది.
ఆర్థిక వ్యవస్థ మెరుగుదల..: డీమోనిటైజేషన్‌తో ఇబ్బందులను అధిగమించడంతో పాటు వ్యవస్థాగత సంస్కరణల తోడ్పాటుతో భార త్ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నదని ఎల్ అండ్ టీ అభిప్రాయపడింది. తమ ఇన్‌ఫ్రా విభాగం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 8%వృద్ధితో రూ. 52,924 కోట్ల ఆదాయాన్ని సాధించిందని ఎల్ అండ్ టీ వివరించింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఎల్ అండ్ టీ ఫలితాలు వెల్లడికాగా, ఫలితాల నేపథ్యంలో ఈ షేరు స్వల్ప పెరుగుదలతో రూ. 1,788 వద్ద ముగిసింది.