ఎల్ అండ్ టీ లాభం రూ.996 కోట్లు
* 16% వృద్ధి
* ఆదాయం 11% అప్
న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 16 శాతం వృద్ధి చెందింది. గత క్యూ2లో రూ.862 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.996 కోట్లకు పెరిగిందని ఎల్ అండ్ టీ తెలిపింది. నికర అమ్మకాలు రూ. 21,159 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ. 23,393 కోట్లకు, కన్సాలిడేటెడ్ స్థూల ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.23,605 కోట్లకు పెరిగి నట్లు వివరించింది.
మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.7,658 కోట్లని(32%) పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.19,374 కోట్ల నుంచి రూ.21,495 కోట్లకు ఎగిశాయని తెలిపింది. ఈ క్యూ2లో రూ.28,620 కోట్ల తాజా ఆర్డర్లు సాధించామని, వీటిల్లో 38 శాతం(రూ.10,973 కోట్లు) విదేశాల నుంచి వచ్చినవేనని తెలిపింది. ఈ ఏడాది 30 నాటికి కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 14 శాతం వృద్ధితో రూ.2,44,097 కోట్లకు చేరిందని వివరించింది.
లాభదాయక ప్రాజెక్టులపైనే దృష్టి
ఈ క్యూ2లో పెట్టుబడుల వాతావరణం మందగమనంలో ఉందని కంపెనీ తెలిపింది. ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా ఉన్నాయని, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. తమ ఆర్డర్ బుక్ భారీగా ఉందని, లాభదాయక ప్రాజెక్టులపైననే దృష్టి కేంద్రీకరిస్తున్నామని, ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటే మంచి వృద్ధిని సాధించగలమని ధీమా వ్యక్తం చేసింది.