చివరి రోజు లాభాలు | last day Benefits | Sakshi
Sakshi News home page

చివరి రోజు లాభాలు

Published Fri, Jan 1 2016 3:30 AM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

చివరి రోజు లాభాలు - Sakshi

చివరి రోజు లాభాలు

158 పాయింట్ల లాభంతో 26,118కు సెన్సెక్స్
 50 పాయింట్ల లాభంతో 7,946కు నిఫ్టీ

 కొత్త ఏడాది జోష్‌తో గత ఏడాది చివరిరోజైన గురువారం నాడు  స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఐటీ, రియల్టీ షేర్ల జోరుతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 158 పాయింట్లు లాభపడి 26,118 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 7,946 పాయింట్ల వద్ద ముగిశాయి.  
 
 రోజంతా లాభాల్లో..
 లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక్క పది నిమిషాలు మినహా మిగిలిన రోజంతా లాభాల్లోనే సాగింది. జీఎస్‌టీ బిల్లు అమలు, ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, వ్యాపార నిర్వహణ మరింత సరళతరం చేయడం, సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాల కల్పన కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టడం.. ఇవన్నీ తమ కొత్త ఏడాది ప్రాధాన్యతాంశాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని నిపుణులంటున్నారు.
 
   జనవరి సిరీస్‌కు పొజిషన్లు క్యారీ ఫార్వార్డ్ జరగడం, కొత్త ఏడాదిలో రాబడులు బాగా ఉంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరపడం సానుకూల ప్రభావం చూపాయి. బడ్జెట్, కంపెనీల ఆర్థిక ఫలితాలపై ఆశావహం కారణంగా వినియోగం క్రమక్రమంగా పుంజుకోగలదన్న అంచనాలతో ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెడతారని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. లాభాల్లో 20 సెన్సెక్స్ షేర్లు.. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి.
 
 హెచ్‌డీఎఫ్‌సీ 2.3 శాతం, గెయిల్ 2.1 శాతం, కోల్ ఇండియా 2 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 2 శాతం చొప్పున పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, టీసీఎస్, మహీంద్రా,  టాటా స్టీల్, ఐటీసీ షేర్లు కూడా లాభాల్లోనే సాగాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే  యాక్సిస్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, లార్సెన్ అండ్ టుబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, సిప్లా షేర్లు నష్టపోయాయి.
 
  2015  సెన్సెక్స్ నష్టం.. 5 శాతం
 2014లో 30 శాతం పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ గత  ఏడాది(2015లో) 1,382 పాయింట్లు(5 శాతం) నష్టపోయింది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 336 పాయింట్లు (4 శాతం)  పడిపోయింది. రూపాయి కూడా గత ఏడాది 5 శాతం క్షీణించింది. 2011 నుంచి చూస్తే  సెన్సెక్స్, నిఫ్టీ.. ఈ రెండు సూచీలకు ఇదే తొలి వార్షిక నష్టం. విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు 300కోట్ల డాలర్లకు తగ్గాయి. గత మూడేళ్లలో ఈ నికర పెట్టుబడులు ఏడాదికి సగటున 2,000 కోట్ల డాలర్లు ఉండడం విశేషం.
 
  గత ఏడాది మార్చి 4 జీవిత కాల గరిష్ట స్థాయి 9,119 పాయింట్లను తాకిన నిఫ్టీ సెప్టెంబర్ 8న 7,540 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది.  గత ఏడాది మార్చిలో 30,024 పాయింట్ల జీవిత కాల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్  చైనా కరెన్సీ విలువ తగ్గించడంతో ఆగస్టు 24న ఒక్కరోజులోనే 1,625 పాయింట్లు నష్టపోయింది. వర్షాలు తగినంతగా లేకపోవడం, కంపెనీల  ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు... మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి.
 
 2 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
 కొన్ని కంపెనీలు ఐపీఓకు రావడం, అలా వచ్చిన కంపెనీలు మంచి పనితీరును కనబరచడంతో గతేడాది సెన్సెక్స్ 5% నష్టపోయినప్పటికీ, బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ రూ.2,02,493 కోట్ల వృద్ధితో రూ.1,00,37,734 కోట్లకు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపద పెరగడం ఇది వరుసగా ఐదో ఏడాది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement