రిటైల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వచ్చే ఏడాది వ్యవధిలో మూడు కార్డులు ప్రవేశపెట్టనుంది...
ఎన్‌పీసీఐ నుంచి మూడు కార్డులు!
రిటైల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వచ్చే ఏడాది వ్యవధిలో మూడు కార్డులు ప్రవేశపెట్టనుంది. వీటిలో ఒకటి క్రెడిట్ కార్డు, మరొకటి ఇంటర్నేషనల్ కార్డు, ఇంకొకటి చిన్న సంస్థల కోసం ఉద్దేశించిన ‘ముద్ర’ కార్డు ఉంటుందని సంస్థ చైర్మన్ ఎం బాలచంద్రన్ తెలిపారు.
తోషిబాకు 32 కోట్ల డాలర్లు నష్టం
లాభాలను పెంచి చూపిన కుంభకోణంలో చిక్కుకున్న జపాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తోషిబా గత ఆర్థిక సంవత్సర ఫలితాలను సవరించింది. ముందుగా 120 బిలియన్ యెన్‌ల వార్షిక లాభాలు అంచనా వేసినప్పటికీ.. సవరించిన దాని ప్రకారం 37.8 బిలియన్ యెన్‌ల మేర (సుమారు 31.8 కోట్ల డాలర్ల) నష్టాన్ని ప్రకటించింది. అయితే, నిర్వహణ లాభాలు మాత్రం యథాతథంగా 170 బిలియన్ యెన్‌ల మేర ఉన్నట్లు వివరించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్!
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే నెల (అక్టోబర్) 1 నుంచి సెకనుకు 2 మెగా బిట్ (ఎంబీపీఎస్) కనీస స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనుంది. టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం 512 కేబీపీఎస్ కనీస స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందిస్తున్నామని, అక్టోబర్ 1 నుంచి నాలుగు రెట్లు అధిక స్పీడ్‌తో అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.
2014 జీడీపీ వృద్ధికి చైనా కోత
చైనా 2014 స్థూల దేశీయోత్పత్తి వద్ధి రేటును 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమన తీరుకు ఇది తాజా సంకేతంగా నిలుస్తోంది. 7.4 శాతం వృద్ధి రేటే గడిచిన 25 ఏళ్లలో కనిష్టమయిన నేపథ్యంలో ఈ రేటు మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గడం గమనార్హం. సవరించిన గణాంకాల ప్రకారం 2014లో స్థూల దేశీయ ఉత్పత్తి విలువ 63.61 ట్రిలియన్ యువాన్లు.
దశలవారీగా పన్ను రాయితీల తొలగింపు
కార్పొరేట్ రంగానికి ఇస్తున్న పన్ను మినహాయింపులను దశలవారీగా తొలగించనున్నామని.. వీటికి సంబంధించి కొద్ది రోజుల్లోనే ఒక జాబితాను విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కార్పొరేట్ పన్నును నాలుగేళ్లలో ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగానే పన్ను రాయితీలను వెనక్కి తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు.
పారిశ్రామికోత్పత్తి జోరు...
భారత పారిశ్రామిక ఉత్పత్తి జూలై గణాంకాలు కూడా ఉత్సాహాన్ని అందించాయి. ఈ నెలలో ఉత్పత్తి వృద్ధి రేటు 4.2 % నమోదయ్యింది. అంటే 2014 జూలై పారిశ్రామిక ఉత్పత్తి విలువతో పోల్చితే... 2015 జూలైలో ఉత్పత్తి విలువ 4.2% అధికంగా ఉందన్న మాట. 2014 జూలైలో ఈ రేటు 0.9 % మాత్రమే.
28 బిలియన్ డాలర్లకు ఔషధ పరిశ్రమ
భారత్‌లో జెనెరిక్ ఔషధ పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానుంది. ప్రస్తుతం 13 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ జెనెరిక్ మార్కెట్ 2020 నాటికి 28 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ విషయాన్ని పరిశ్రమ సమాఖ్య అసోచామ్, రీసెర్చ్ సంస్థ ఆర్‌ఎన్‌సీఓఎస్‌లు వాటి నివేదికలో పేర్కొన్నాయి. భారత కంపెనీలకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు లభించనుండటం ఈ వృద్ధికి దోహదపడనున్నాయి.
ఇక పసిడికీ వడ్డీ వస్తుంది
బంగారం బాండ్, పసిడి డిపాజిట్ (మోనిటైజేషన్) పథకాలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. మెటల్‌గా (ఫిజికల్ గోల్డ్) పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకువచ్చి, ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలు.
ఇండిగో లాభం నాలుగింతలు
విమానయాన సంస్థ ఇండిగో గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,304 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధిక వార్షిక వృద్ధి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.317 కోట్లు)తో పోల్చితే నాలుగింతల వృద్ధిని నమోదు చేసింది. వరుసగా ఏడు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీకి లాభాలు వచ్చాయి. సంస్థ త్వరలో ఐపీఓ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించనుంది. దేశీ విమానయాన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికి ఇండిగో మెరుగైన ప్రదర్శనను కనబరచడం గమనార్హం.
తగ్గుతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుదల ధోరణి వరుసగా రెండవ వారంలోనూ కొనసాగింది. సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో (ఆగస్టు 28)తో పోలిస్తే విదేశీ మారక నిల్వలు 2.88 బిలియన్ డాలర్లు తగ్గి 349 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం వారం కూడా విదేశీ మారకపు నిల్వలు 3.43 బిలియన్ డాలర్లు తగ్గి 352 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే సంబంధిత 2 వారాల్లో విదేశీ మారక నిల్వలు దాదాపు 6.32 బిలియన్ డాలర్లు తగ్గాయన్నమాట.
1.2 శాతానికి తగ్గిన క్యాడ్
భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2015-16, ఏప్రిల్-జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 1.2 శాతంగా నమోదయ్యింది. అంటే క్యూ1 జీడీపీ విలువలో క్యాడ్ రేటు 1.2 శాతం ఉందన్నమాట. విలువ రూపంలో చూస్తే 6.2 బిలియన్ డాలర్లు. భారత్ నుంచి సేవా రంగం ఎగుమతులు క్యాడ్ దిగువ స్థాయిల్లో నమోదుకావడానికి కారణం.
పాత కార్ల వేలానికి ‘టయోటా ఆక్షన్ మార్ట్’
జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ టయోటా భారత్‌లో పాత కార్ల వేలం వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. దీని కోసం ‘టయోటా ఆక్షన్ మార్ట్’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. బెంగళూరు సమీపంలోని బిడది ప్రాంతంలో వేలం సదుపాయాల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఆక్షన్ మార్ట్ ద్వారా అన్ని బ్రాండ్లకు సంబంధించిన పాత కార్లు ప్రస్తుతం ఏ కండీషన్‌లో ఉన్నాయో సవివరాత్మక సమాచారాన్ని కస్టమర్లకు అందిస్తామని టీకేఎం మేనేజింగ్ డెరైక్టర్ నవోమి ఐషీ తెలిపారు.
డీల్స్..
- జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తాజాగా జేపీ గ్రూప్‌నకు చెందిన బీనా థర్మల్ పవర్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. డీల్ విలువ సుమారు రూ. 3,500 కోట్లు ఉంటుందని అంచనా.
- ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్).. ‘మోడర్న్’ బ్రాండ్‌పై నిర్వహించే బ్రెడ్, బేకరీ వ్యాపారాన్ని విక్రయించింది. ఎవర్‌స్టోన్ గ్రూప్‌కి చెందిన నిమన్ ఫుడ్స్ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ ఎంత అన్నది వెల్లడి కాలేదు.
- వ్యాపార దిగ్గజం జేకే గ్రూప్ తాజాగా కేశోరామ్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ క్యావెండిష్ ఇండస్ట్రీస్‌ను (సీఐఎల్) కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 2,200 కోట్లు.
నియామకాలు
- పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా టెక్నాలజీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఐడీజీ వెంచర్స్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్‌గా చేరారు.
- ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవోగా రాకేశ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. కెనరా బ్యాంక్‌లో చేరడానికి ముందు ఆయన 2014 మార్చి 7 నుంచీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా పనిచేశారు.