
గతవారం బిజినెస్
రుణ రేటు తగ్గించిన యాక్సిస్ బ్యాంక్
ప్రైవేటు రంగంలోని మూడవ దిగ్గజ బ్యాంక్– యాక్సిస్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) 0.1 శాతం నుంచి 0.15 శాతం శ్రేణిలో తగ్గించింది. శనివారం నుంచి తగ్గించిన రుణ రేట్లు అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఓవర్‌నైట్ టెన్యూర్ విషయంలో 10 బేసిస్ పాయింట్లు, మిగిలిన అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. నిర్థిష్ట కాలానికి నిధుల సమీకరణ, వ్యయాల ప్రాతిపదికన ఎంసీఎల్‌ఆర్ నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా నెలకు ఒకసారి ఈ రేట్ల సమీక్ష ఉంటుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ తాజా విధానం అమల్లోకి వచ్చింది.
నవంబర్‌లో ఎగుమతులు ప్లస్‌లోనే!
దేశీ ఎగుమతులు వరుసగా మూడవనెల కూడా వృద్ధి చెంది ప్రభుత్వానికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. నవంబర్‌లో ఇవి 2.29 శాతం వృద్ధి చెంది 20 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు మొత్తం గణాంకాలను ప్లస్‌లో ఉంచాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 14.10 శాతం పెరగగా, పెట్రోలియం ఉత్పత్తులు 5.73 శాతం పెరిగాయి. కెమికల్స్ విభాగంలో ఎగుమతులు 8.3 శాతం ఎగశాయి. మరోవైపు దిగుమతులు కూడా నవంబర్‌లో 10.44 శాతం ఎగసి 33 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతులు–దిగుమతులకు మధ్య వ్యత్యాసం... వాణిజ్య లోటు 13 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెంపు
అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 0.50–0.75 శాతం శ్రేణికి ఎగసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉండడమే రేటు పెంపు నిర్ణయానికి కారణమని ఫెడ్ పేర్కొంది. వచ్చే మూడేళ్లూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉందనీ ఫెడ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఏడాదికి మూడు దఫాలుగా రేట్ల పెంపు అవకాశం ఉండవచ్చని ప్రకటించింది.
ముందస్తు పన్నుల్లో బ్యాంకుల వెనుకంజ!
ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో మూడవ త్రైమాసికంలో అగ్ర బ్యాంకులు వెనకబడ్డాయి. దీంతో అతిపెద్ద రెవెన్యూ జోన్‌గా పేరొందిన ముంబైలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్ల వృద్ధి కేవలం 10 శాతంగా నమోదయింది. ఈ ప్రాంతంలోని 43 అతిపెద్ద కార్పొరేట్ల చెల్లింపులు వార్షికంగా చూస్తే, 10 శాతం వృద్ధితో రూ.24,811 కోట్ల నుంచి (గత ఏడాది ఇదే త్రైమాసికంలో) రూ.27,321 కోట్లకు పెరిగాయి. ఎస్‌బీఐ చెల్లింపులు 25 శాతం పడిపోయి రూ.1,731 కోట్ల నుంచి రూ.1,282 కోట్లకు పడిపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్ విషయంలో కూడా ఈ రేటు 27.3 శాతం క్షీణించి రూ.1,650 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు దిగింది.
టోకు వస్తువుల డిమాండ్ డౌన్!
పెద్ద నోట్లు రద్దు ప్రభావం వ్యవస్థలో డిమాండ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. రిటైల్‌తో పాటు టోకు వస్తువుల డిమాండ్ ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల విషయంలో భారీగా పడిపోయింది. నవంబర్‌లో డిసెంబర్ టోకు ద్రవ్యోల్బ ణం 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2015 నవంబర్‌తో పోల్చితే 2016 నవంబర్‌లో 3.15 శాతమే పెరిగిందన్నమాట. అక్టోబర్‌లో ఈ రేటు 3.39 శాతం. ఇక నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రెండేళ్ల కనిష్ట స్థాయిలో 3.63 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.
మ్యూచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు
మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు గత నెలలో జోరుగా వచ్చాయి. ఈ నవంబర్‌లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌ల్లోకి రూ.36,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) పేర్కొంది. డెట్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అధికంగా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయని వివరించింది.
అక్కడ కూడా మనం..
ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా రూపొందించిన అమెరికాకు చెందిన 40 ఏళ్లలోపు సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు స్థానం దక్కించుకున్నారు. బయోటెక్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి 600 మిలియన్ డాలర్ల సంపదతో 24వ స్థానంలో నిలిచారు. అపూర్వ మెహ్‌తా 360 మిలియన్ డాలర్ల సంపదతో 31వ స్థానంలో ఉన్నారు. ఇక జాబితాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉంది.
సెప్టెంబర్ క్వార్టర్‌లో తగ్గిన క్యాడ్
కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 0.6 శాతానికి తగ్గింది. వాణిజ్య లోటు తగ్గడంతో క్యాడ్ జీడీపీలో 0.6 శాతంగా (340 కోట్ల డాలర్లు) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఈ క్యాడ్ జీడీపీలో 1.7 శాతంగా (850 కోట్ల డాలర్లు) ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో క్యాడ్ (జీడీపీలో 0.1 శాతం–30 కోట్ల డాలర్లు)తో పోల్చితే క్యూ2లో కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉంది.
భారత్‌లోకి గ్లోబల్ రి–ఇన్సూరెన్స్ కంపెనీలు!
గ్లోబల్ రి–ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చే 6–9 నెలల కాలంలో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముందని ఐఆర్‌డీఏ అంచనా వేసింది. ’దిగ్గజ గ్లోబల్ రి–ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మాకు ఏడు దరఖాస్తులు వచ్చాయి. లాయిడ్స్ వంటి సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ భారత్‌లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఈ దరఖాస్తులను పరిశీలిస్తోంది’ అని ఐఆర్‌డీఏ హోల్‌టైమ్ మెంబర్ (ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్) వి.ఆర్. అయ్యర్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఇండియన్ రి–ఇన్సూరెన్స్ మార్కెట్‌లో కేవలం ‘జీఐసీ’ మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
నియామకం
ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా వి.కె.శర్మ నియమితులయ్యారు. ఈయన ఎల్‌ఐసీ చీఫ్‌గా ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు. ఈయన ప్రస్తుతం ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా వ్యవహరిస్తూనే సంస్థ తాత్కాలిక చైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్‌ఐసీ చైర్మన్ పదవి నుంచి ఎస్.కె.రాయ్ జూన్‌లో హఠాత్తుగా వైదొలిగిన విషయం తెలిసిందే.
డీల్స్..
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్... ఆస్ట్రేలియాకు చెందిన కన్సల్టింగ్, బిజినెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ సర్వీసులందించే అడప్ట్రా సంస్థను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఈ కంపెనీ కొనుగోలుతో తమ బీమా వ్యాపార విభాగం మరింత శక్తివంతం కానున్నదని కాగ్నిజెంట్ వెల్లడించింది.
ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్... పుణేలోని వెస్ట్‌ల్యాండ్ మాల్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది.
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలివర్ (హెచ్‌యూఎల్) అనుబంధ కంపెనీ ఒకటి లెదర్ బిజినెస్ ఆస్తులను హిందుస్తాన్ ఫుడ్స్‌కు విక్రయించనుంది. తమ అనుబంధ కంపెనీ, తోలు ఉత్పత్తులను తయారు చేసే పాండ్స్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెట్ లెదర్ బిజినెస్‌కు చెందిన కొన్ని చరాస్తులను, నిల్వలను హిందుస్తాన్ ఫుడ్స్‌కు విక్రయించనున్నామని హెచ్‌యూఎల్ తెలిపింది.