గతవారం బిజినెస్‌ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Apr 10 2017 2:21 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

నియామకాలు
ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ నాస్కామ్‌ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గా రిషద్‌ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. అజీమ్‌ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు.

ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ కొత్త సీఈవోగా ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ నియమితులయ్యారు. జూలై 1 నుంచి ఆయన సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సుబ్రమణ్యన్‌ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. మరోవైపు, దాదాపు 17 ఏళ్లుగా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎం నాయక్‌.. సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఈయన అక్టోబర్‌ 1 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఇన్ఫోసిస్‌లో మళ్లీ జీతాల రగడ  
ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు, కంపెనీ యాజమాన్యానికి మధ్య మరోసారి వివాదం రగులుకుంది. సీవోవో ప్రవీణ్‌రావు పారితోషికాన్ని భారీగా పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కంపెనీ వాటాదారులు తాజాగా ఆమోదం తెలిపారు. దీంతో మరోసారి ఈ అంశంపై మాటల యుద్ధం మొదలైంది. వేతనాల విషయంలో కింది ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో ఉన్నత ఉద్యోగులకు పారితోషికాలు భారీగా పెంచడం ఏవిధంగా సమంజసమని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులైన ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి ప్రశ్నించారు. చాలా వరకు కింది స్థాయి ఉద్యోగులకు 6 నుంచి 8% మేర వేతనాలు పెంచుతూ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు 60 నుంచి 70% పెంచడం అనైతికమన్నారు.  

తగ్గిన ఎస్‌బీఐ బేస్‌ రేటు
ఎస్‌బీఐ తాజాగా రుణాలపై వడ్డీ రేటుకు సంబంధించిన బేస్‌ రేటును 0.15% మేర తగ్గించింది. దీంతో ఇది 9.25% నుంచి 9.10%కి దిగి వచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని వర్తింపచేస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. మరోవైపు, బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును (బీపీఎల్‌ఆర్‌) కూడా 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఇది 14% నుంచి 13.85%కి చేరింది. ఎంసీఎల్‌ఆర్‌ మాత్రం యథాతథంగా ఉంటుంది. కాగా మరొకవైపు బ్యాంక్‌ పెంచిన చార్జీలు, మార్చిన నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఎస్‌బీఐలో కొత్తగా విలీనమైపోయిన అనుబంధ బ్యాంకుల కస్టమర్లకు ఈ చార్జీలు ఏప్రిల్‌ 24 నుంచి వర్తిస్తాయి.

లక్ష్యాన్ని దాటిన పన్నుల రాబడి
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో పన్ను వసూళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్‌ సందర్భంగా రూ.16.97 లక్షల కోట్ల పన్ను వసూళ్లను అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం సవరించిన లక్ష్యాన్ని పేర్కొంది. కానీ పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికంగా పన్నుల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

కార్పొరేట్‌ అవినీతిలో 9వ స్థానంలో భారత్‌
వ్యాపారాల నిర్వహణలో అవినీతి, లంచగొండితనం విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ 9వ స్థానంలో నిల్చింది. అయితే 2015లో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ ఈసారి తొమ్మిదో స్థానానికి తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం 41 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా.. కార్పొరేట్‌ అవినీతిలో ఉక్రెయిన్‌ అగ్రస్థానంలోను.. సైప్రస్, గ్రీస్‌ తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి.

రెపో యథాతథం
ఆర్‌బీఐ రెపోను యథాతథంగా 6.25%గా కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకుల వద్ద అధిక నిల్వల (లిక్విడిటీ) పరిస్థితి నెలకొనడం, పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ భారీ పెరుగుదల దీనితో ద్రవ్యోల్బణం భయాలు, వృద్ధి బాటలో ప్రభుత్వ వ్యయాలు వంటి అంశాలు దీనికి కారణం. మరోవైపు ఆర్‌బీఐ రివర్స్‌ రెపోను పావుశాతం పెంచి 6%కి చేర్చింది. అలాగే మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌)ను కూడా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5%కి తగ్గింది.  

ఎఫ్‌డీలే ముద్దు
భారతీయులు మ్యూచువల్‌ ఫండ్స్, షేర్ల కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లవైపే (ఎఫ్‌డీలు) ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని సెబీ తాజా సర్వేలో తేలింది. దీని ప్రకారం.. 95%కి పైగా భారతీయులు తమ సొమ్ములను బ్యాంక్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేస్తుండగా, 10% కన్నా తక్కువ మందే మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఎఫ్‌డీల తర్వాత జీవిత బీమా పాలసీలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌ పథకాలు, రియల్‌ ఎస్టేట్, మ్యూచువల్‌ ఫండ్స్, స్టాక్‌ మార్కెట్‌ ఉన్నాయి.

విశ్వసనీయమైన బ్రాండ్‌ ’శాంసంగ్‌’
దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ సంస్థ శాంసంగ్‌ తాజాగా భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో సోనీ, ఎల్‌జీ ఉన్నాయి. ఇక నాల్గవ స్థానంలో యాపిల్‌ ఉంది. కాగా టాప్‌–5లో కేవలం ఒకే ఒక దేశీ కంపెనీ టాటా గ్రూప్‌ మాత్రమే స్థానం పొందగలిగింది. ఇది ఐదో స్థానంలో ఉంది. ఇక ఆరవ స్థానంలో హోండా కొనసాగుతోంది.

గ్రాసరీలోకి ఫ్లిప్‌కార్ట్‌ రీఎంట్రీ!
దేశీ ఈ–కామర్స్‌ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’ తాజాగా గ్రాసరీ విభాగంలోకి పునరాగమనం చేస్తోంది. దీని ద్వారా దేశీ రిటైల్‌ పరిశ్రమలో సాధ్యమైనంత వాటాను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ‘మేం గ్రాసరీ విభాగంలోకి మళ్లీ అడుగుపెడుతున్నాం. దేశీ కొనుగోళ్లలో 80 శాతం యూనిట్లు గ్రాసరీకి చెందినవే. గ్రాసరీ మార్కెట్‌ విలువ 400–600 మిలియన్‌ డాలర్ల శ్రేణిలో ఉంది. అందుకే మేం ఇందులోకి మళ్లీ వస్తున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. కాగా ఫ్లిప్‌కార్ట్‌ ఇదివరకు 2015 అక్టోబర్‌లో గ్రాసరీ (కిరాణ) వస్తువులు ఆర్డర్ల కోసం ప్రత్యేకమైన యాప్‌ ‘నియర్‌బై’ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కానీ తగినంత ఆదరణ లేకపోవడంతో తర్వాత కొన్ని నెలలకే ఈ వ్యాపారాన్ని మూసేసింది.

  మార్చిలో తయారీ రంగం పరుగు
తయారీ రంగం మార్చిలో మంచి పనితీరును ప్రదర్శించింది. ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.2కు చేరింది. ఐదు నెలల్లో సూచీ ఈ స్థాయికి వెళ్లడం ఇదే తొలిసారి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతుల ఆర్డర్లు పెరగడం ఈ సానుకూల ఫలితానికి కారణమని నికాయ్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన  ఉంటే, క్షీణతగా భావించడం జరుగుతుంది. నవంబర్‌ 8  డీమోనిటైజేషన్‌ అనంతరం రెండు నెలలు దేశంలో తయారీరంగం తీవ్ర ఒడిదుడుకులకు గురయిన సంగతి తెలిసిందే. తిరిగి క్రమంగా ఈ రంగం కోలుకుంటోంది.

డీల్స్‌..
ఎస్‌బీఐ తాజాగా ట్రావెల్‌ ప్రిపెయిడ్‌ కార్డుల విక్రయానికి సంబంధించి ప్రముఖ ట్రావెల్‌ గ్రూప్‌ కంపెనీ కాక్స్‌ అండ్‌ కింగ్స్‌తో పంపిణీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మలేషియాలో బహుళార్ధ పోర్టు నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఎంఎంసీ పోర్ట్స్‌తో అదానీ గ్రూప్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఆభరణాల రిటైల్‌ చెయిన్‌ కళ్యాణ్‌ జ్యూయలర్స్‌ కంపెనీలో అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్‌ పిన్‌కస్‌ రూ.500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది.

దేశంలో నైటింగేల్స్‌ పేరిట హోమ్‌ హెల్త్‌కేర్‌ విభాగంలో సేవలందిస్తున్న మెడ్‌వెల్‌ వెంచర్స్‌ తాజాగా రూ.134 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్‌బీలో భాగంగా మహీంద్రా పార్టనర్స్, 8 రోడ్స్‌ వెంచర్స్, ఎఫ్‌ప్రైమ్‌ క్యాపిటల్‌ ఈ పెట్టుబడులు పెట్టాయి.  

ఖనిజాలు, లోహాల వ్యాపారంలో ఉన్న ట్రైమెక్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పామాయిల్‌ విపణిలోకి ప్రవేశించింది. ముడి పామాయిల్‌ ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజమైన మలేషియా సంస్థ ఫెల్డా గ్లోబల్‌ వెంచర్స్‌ హోల్డింగ్‌ బెర్హడ్‌తో కంపెనీ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద ఫెల్డా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ట్రైమెక్స్‌ విక్రయిస్తుంది.

ఏరోస్పేస్‌ దిగ్గజాలు బోయింగ్, జెట్‌బ్లూ సంస్థలు జునుమ్‌ ఏరో స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాయి.

సహకార ఎరువుల తయారీ దిగ్గజం ఇఫ్కో తాజాగా స్టార్టప్‌ సంస్థ గ్రామీణ్‌ హెల్త్‌ కేర్‌లో 26 శాతం వాటాలు దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement