గతవారం బిజినెస్ ఐపీఓ కాలమ్.. | last week business IPO column | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్ ఐపీఓ కాలమ్..

Published Mon, Oct 24 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

గతవారం బిజినెస్ ఐపీఓ కాలమ్..

గతవారం బిజినెస్ ఐపీఓ కాలమ్..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నది. రూ.750-775 ధర శ్రేణిగా గల ఈ ఐపీఓ ఈ నెల 27న ముగియనున్నది. కొత్త షేర్ల జారీతో రూ.3,000 కోట్లు సమీకరించనున్నది. మొత్తం షేర్లలో 2.5 లక్షల షేర్లను అర్హత గల ఉద్యోగులకు కేటాయిస్తారు. ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 19  ఈక్విటీ షేర్లకు బిడ్ చేయాలి.

వరుణ్ బేవరేజెస్ కంపెనీ తన ఐపీఓకు ధర శ్రేణిని రూ.440-445 గా నిర్ణయించింది. ఈ ఐపీఓ ఈ నెల 26న ప్రారంభమై, 28న ముగుస్తుంది. ఈ ఐపీఓలో భాగంగా 13.7 శాతానికి సమానమైన 2.5 కోట్ల షేర్లను వరుణ్ బేవరేజెస్ ఆఫర్ చేస్తోంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,112.5 కోట్లు సమీకరిస్తుందని అంచనా.

సువెన్ లైఫ్‌కు రెండు పేటెంట్లు
బయోఫార్మా సంస్థ సువెన్ లైఫ్‌సెన్సైస్ తాజాగా యూరప్, ఇజ్రాయెల్‌లో రెండు పేటెంట్లు దక్కించుకుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ తదితర కేంద్ర నాడీ మండల సంబంధ సమస్యల చికిత్సలో ఉపయోగపడే కొత్త రసాయన మేళవింపు (ఎన్‌సీఈ)లకు ఇవి లభించినట్లు వివరించింది. 2030 దాకా వీటి గడువు ఉంటుందని సంస్థ పేర్కొంది.  దీంతో యూరప్‌లో మొత్తం 23, ఇజ్రాయెల్‌లో 12 పేటెంట్లు లభించినట్లయిందని కంపెనీ సీఈవో వెంకట్ జాస్తి తెలిపారు.

క్యూ3లో చైనా వృద్ధి 6.7 శాతం
చైనా ఆర్థికాభివృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో 6.7 శాతంగా నమోదయ్యింది. రియల్టీ మార్కెట్ బాగుండడం, ప్రభుత్వ వ్యయాలు, రుణాల వంటి అంశాలు ఈ స్థిర వృద్ధికి కారణం. వృద్ధి  ఊహించిన దానికన్నా బాగుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) అభిప్రాయపడింది. వరుసగా మూడు త్రైమాసికాల నుంచీ చైనా ఆర్థికాభివృద్ధి రేటు 6.7 శాతంగా కొనసాగుతోంది. 

దిగ్గజ టె ల్కోలపై 3,050 కోట్ల జరిమానా!
కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకమ్‌కు ఇంటర్ కనెక్టివిటీ సర్వీసులు నిరాకరించిన ఫలితంగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లపై రూ.3,050 కోట్ల జరిమానా విధించాలని టెలికం శాఖకు రెగ్యులేటర్ ట్రాయ్ సిఫారసు చేసింది. మూడు టెలికం సంస్థల ధోరణి పోటీతత్వానికి, వినియోగదారుల ప్రయోజనానికి విఘాతమని వివరించింది.

మూడో పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా భారత్!
భారత్ 2026 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది. ఒక దేశానికి వచ్చే వెళ్లే విమాన ప్రయాణికుల సంఖ్యనే ఇక్కడ ఏవియేషన్ మార్కెట్‌గా పరిగణనలోకి తీసుకున్నాం. ఐఏటీఏ ప్రకారం.. ప్రపంచంలో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశాల్లో ఇండియా 9వ స్థానంలో ఉంది. 2029 నాటికి చైనా అమెరికాను వెన క్కు నెట్టి అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుంది. ఇక 2026 నాటికి యూకేను వెనక్కు నెట్టి భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. 

టాప్-15 ప్రపంచ ధనిక నగరాల్లో ముంబై
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై తాజాగా ప్రపంచంలోని టాప్-15 ధనిక నగరాల జాబితాలో స్థానం పొందింది. ఇది 820 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబైలో 45,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ విషయాలను న్యూ వరల్డ్ వెల్త్ తన నివేదికలో వెల్లడించింది. ఇక 2.7 ట్రిలియన్ డాలర్ల సంపదతో లండన్ జాబితాలో అగ్ర  స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో న్యూయార్క్ (2.6 ట్రిలియన్ డాలర్లు), టోక్యో (2.2 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి.

ఉడాన్ పథక ఆవిష్కరణ
విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి చేరువ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ అనుసంధాన పథకం ‘ఉడాన్’ (ఉదే దేశ్‌కా ఆమ్ నాగరిక్)ను ఆవిష్కరించింది. ఈ పథకం కింద చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. గరిష్టంగా రూ.2,500కే ప్రయాణించే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఉడాన్ పథకం కింద తొలి విమానయాన సర్వీసు ఈ జనవరిలో ప్రారంభం కానుంది.  

విమాన ప్రయాణికుల రద్దీ 23% వృద్ధి
దేశీ విమాన ప్రయాణికుల రద్దీ సెప్టెంబర్‌లో 23.4 శాతంగా నమోదయ్యింది. వివిధ విమానయాన కంపెనీలు ఈ నెలలో మొత్తంగా 82.3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఇండిగో 40 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో జెట్ ఎయిర్‌వేస్ (16.2 శాతం), ఎయిర్ ఇండియా (14.7 శాతం), స్పైస్‌జెట్ (12.5 శాతం) వంటి తదితర కంపెనీలు ఉన్నాయి. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే నెలలో నమోదైన విమాన ప్రయాణికుల సంఖ్య 66.66 లక్షలుగా ఉంది.

ఎస్టోనియా జీడీపీ = ముకేశ్ అంబానీ సంపద
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే నెంబర్ వన్ కుబేరుడైన ముకేశ్ అంబానీ సంపద.. యూరప్‌లోని ఎస్టోనియా దేశ జీడీపీకి (22.69 బిలియన్ డాలర్లు) సమానంగా ఉందని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ముకేశ్ అంబానీ సంపద విలువ 22.7 బిలియన్ డాలర్లు. ఈయన తర్వాతి స్థానాల్లో సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ (16.9 బిలియన్ డాలర్లు), హిందూజా కుటుంబం (15.2 బిలియన్ డాలర్లు) ఉన్నారు. అలాగే విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 15 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశ జీడీపీ (14.69 బిలియన్ డాలర్లు) కన్నా ఎక్కువ. ఇక ఐదో స్థానంలో పల్లోంజి మిస్త్రీ (13.9 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

డీల్స్..

టీవీఎస్ గ్రూప్‌కు చెందిన థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ, టీవీఎస్ లాజిస్టిక్స్ సర్వీసెస్‌లో కెనడాకు చెందిన రెండో అతి పెద్ద పెన్షన్ ఫండ్,  సీడీపీక్యూ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.

క్లౌడ్ సర్వీసులందజేసే అమెరికాకు చెందిన ‘అప్పిరియో’ సంస్థను దేశీ ఐటీ దిగ్గజం విప్రో రూ.3,340 కోట్లకు (50కోట్ల డాలర్లు) కొనుగోలు చేసింది.

చిన్నారుల ఉత్పత్తుల విభాగంలో ఉన్న ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ ఫస్ట్‌క్రై , ఇదే రంగంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన ‘బేబీఓయే’ను సొంతం చేసుకోనుంది. డీల్ విలువ రూ.361 కోట్లుగా ఉంది.

ఆన్‌లైన్ పర్యాటక సేవల సంస్థ మేక్‌మై ట్రిప్ తన ప్రత్యర్థి సంస్థ ఐబిబోను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరగనుంది.

ఇండియా హోమ్‌లోన్(ఐహెచ్‌ఎల్)లో 24.5% వాటాను జేఎం ఫైనాన్షియల్‌కు చెందిన అనుంబంధ కంపెనీ, జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement