గతవారం పసిడి.. స్వల్ప నష్టం...
న్యూఢిల్లీ: పసిడి గడచిన వారంలో స్వల్పంగా దాదాపు రూ.100 తగ్గింది. ముంబై బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.26,480 వద్ద ముగి సింది. ఇక వెండి కేజీ ధర దాదాపు రూ.1,200 లాభపడింది. రూ.37,430 వద్ద ముగిసింది. ఆభరణాలు, రిటైల్ వర్తకుల మందగమన కొనుగోళ్లు బంగారం ధరపై ప్రభావం చూపాయి. దీపావళి పండుగ నేపథ్యంలో నాణాలకు డిమాండ్ ఏర్పడడంతో వెండి ధర పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ను చూస్తే.. పసిడి, వెండి ధరలు వారంలో కొంత పెరిగాయి.
వడ్డీరేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ ఆలస్యం చేస్తుందన్న వార్తలు ఈ విభాగంలో నష్టాలు పూడ్చుకోడానికి కొంత ఉపయోగపడింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ ధర శుక్రవారం ఔన్స్‌కు (31.1 గ్రా) 1,156 డాలర్ల వద్ద ముగిసింది. గత వారం ముగింపు 1,137 డాలర్లు. కాగా వెండి ఔన్స్‌కు 15.26 డాలర్ల నుంచి 15.82 డాలర్లకు ఎగసింది.