తిరుపతి ప్లాంటుకు రూ.500 కోట్లు: లావా
నెలకు 50 లక్షల ఫోన్ల ఉత్పత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యాండ్‌సెట్ల తయారీ రంగంలో ఉన్న లావా మొబైల్స్ తిరుపతి మొబైల్స్ హబ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుకు రూ.500 కోట్లు పెట్టుబడి చేయనుంది. 2017 నాటికి ప్లాం టులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 20 ఎకరాల్లో రానున్న ఈ ప్లాంటు పూర్తిగా సిద్ధమైతే నెలకు 50 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని లావా ఇంటర్నేషనల్ చీఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫీసర్ సంజీవ్ అగర్వాల్ వెల్లడించారు.
తమ ప్లాంటు ద్వారా 12,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్‌లో పూర్తి తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని, స్థానికంగా విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తామన్నారు. తిరుపతి సమీపంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటవుతున్న శ్రీవెంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ దసరా రోజున శంకుస్థాపన చేశారు.
2022కి రూ.2,615 కోట్లు..
ఆరు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభమైన లావాకు చెందిన నోయిడా ప్లాంటు సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లు ఉంది. ఈ ప్లాంటులో తయారీ వ్యయం చైనా స్థాయిలోనే ఉందని సంజీవ్ వెల్లడించారు. భారత్‌లో రెండు తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు 2022 నాటికి రూ.2,615 కోట్లు ఖర్చు చేస్తామని జూలైలో లావా సీఎండీ హరి ఓం రాయ్ ప్రకటించారు. కొంత మొత్తం ఆర్‌అండ్‌డీకి వెచ్చిస్తామన్నారు. ఈ ప్లాంట్లు పూర్తి అయితే సంస్థ తయారీ సామర్థ్యం మొత్తం నెలకు 1.8 కోట్ల యూనిట్లకు చేరుతుంది.