అనుచిత పన్ను డిమాండ్ సరికాదు | Legal gap prevents govt from sacking CBI boss, says Arun Jaitley | Sakshi
Sakshi News home page

అనుచిత పన్ను డిమాండ్ సరికాదు

Published Sat, Nov 22 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

అనుచిత పన్ను డిమాండ్ సరికాదు

అనుచిత పన్ను డిమాండ్ సరికాదు

న్యూఢిల్లీ: అనుచిత పన్ను డిమాండ్ సరికాదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పేర్కొన్నారు. ఇది పెట్టుబడుల కోణంలో దేశానికి చెడ్డపేరు తెస్తుందని వ్యాఖ్యానించారు. ఆయిల్ రంగ దిగ్గజం షెల్ ఇండియాకు సంబంధించిన షేర్ల బదిలీ (ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ వివాదంలో రూ.18,000 కోట్ల పన్ను డిమాండ్ వ్యవహారం) కేసులో ఆదాయపన్ను శాఖకు ముంబై హైకోర్టులో రెండు రోజుల క్రితం  చుక్కెదురైన నేపథ్యంలో అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

 బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌తో నెలకొన్న రూ.20,000 కోట్ల పన్ను వివాదం కూడా విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపిం దన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.    ‘‘అనుచితమైన డిమాండ్‌తో పన్ను వసూళ్లు చేయలేరు. ఇలాంటి డిమాండ్లు పుస్తకాల్లో మాత్రమే బాగున్నట్లు కనబడతాయి. అయితే ఈ తరహా డిమాండ్లు కోర్టు విచారణా ప్రక్రియలో చిక్కుకుపోతాయి. దేశంలో పెట్టుబడుల అంశానికి సంబంధించి చెడ్డ పేరునూ ఇలాంటి వ్యవహారం తెచ్చిపెడుతుంది’’ అని హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే పన్ను చెల్లించాల్సినవాళ్లు తప్పక చెల్లించాల్సిందేనని అన్నారు.

ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వం పన్ను చట్టాలకు రెట్రాస్పెక్టివ్ (గత కాలం పన్నులను తిరగతోడే క్రమం) సవరణలను కూడా జైట్లీ ఈ సందర్భంగా సూచనప్రాయంగా ప్రస్తావించారు. పన్నుల విధింపు ప్రక్రియ పెట్టుబడిదారుకు స్నేహపూర్వకంగా లేనప్పుడు వారు తమ పెట్టుబడులు పెట్టేందుకు మరొక దేశం వైపు చూస్తారని వ్యాఖ్యానించారు. తయారీ రంగంలో నెల కొన్న ఇబ్బందుల వల్ల పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్య సాధనలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

 ఇవీ సవాళ్లు...
 పన్నుల వ్యవస్థను ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా మలచడం, భూ స్వాధీన ప్రక్రియను తగిన విధంగా రూపొందించడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాళ్లని కూడా ఆయన అన్నారు. భూ స్వాధీన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం చాలా సంక్లిష్టమైనదని వ్యాఖ్యానిస్తూ, దీనిని సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందాలనుకుంటున్న మూడు నిర్దిష్ట సంస్కరణల అంశాల గురించి అడిగిన ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ, బీమా, బొగ్గు చట్టాలు, వస్తువుల సేవల పన్ను (జీఎస్‌టీ)లను ప్రస్తావించారు. సంస్కరణలకు రాజకీయపరమైన అడ్డంకులు ఉంటాయన్నారు. అయితే రాజకీయ రహితంగా దీనిపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

 ఆ నాలుగు రంగాల్లో నల్లడబ్బు!
 నల్లడబ్బుపై ఆయన మాట్లాడుతూ రియల్టీ, ఆభరణాల మార్కెట్, లగ్జరీ మార్కెట్, మైనింగ్ రంగాల్లో ఈ సమస్య ఉందని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయా రంగాల్లో దృష్టి పెట్టాలని ప్రత్యక్ష పన్నుల చీఫ్ కమిషనర్లకు సూచించినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లడబ్బును దేశానికి తీసుకురావడానికి చట్టపరమైన తగిన  అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.

 నాకు ఓర్పు ఉంది...
 కాగా డిసెంబర్ 2న ఆర్‌బీఐ పాలసీరేటును తగ్గిస్తుందని భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ‘‘నాకు చాలా ఓర్పు ఉంది’’ అని అన్నారు. ఆర్థిక మంత్రిత్వశాఖ-రిజర్వ్ బ్యాంక్ మధ్య సంబంధంపై మాట్లాడుతూ, అప్పుడప్పుడూ ఇలాంటి తరహా చర్చ జరుగుతున్నా... దీనిని అర్థవంతమైన చర్చలో భాగంగా మాత్రమే పరిగణించాలి తప్ప మరోవిధంగా భావించాల్సిన అవసరం లేదని అన్నారు.

 సీబీఐ డెరైక్టర్ నియామకంపై...
 సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై జైట్లీ వ్యాఖ్యానిస్తూ, ఇలాంటి అత్యున్నత స్థాయి నియామకాల విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement