
అప్పుడు 26, ఇపుడు 62
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ నూతన ఛైర్మన్ నందన్ నీలకేని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చీ రావడంతోనే పనిలో పడిపోయారు. సంస్థ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో గురువారం రీఎంట్రీ ఇచ్చిన తరువాత పెట్టుబడిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు కంపెనీ వృద్ధి కొనసాగుతుందంటూ వాటాదారులకు నందన్ నీలేకని హామీ ఇచ్చారు. కంపెనీ సభ్యుల మధ్య స్థిరత్వంపై నీలేకని మాట్లాడుతూ, చాలా స్థిరమైన బోర్డుతో తాము పటిష్టంగా ఉన్నామని, సభ్యుల పూర్తి మద్దతు తనకు ఉందని స్పష్టం చేశారు. బోర్డు తనను ఏకగ్రీవంగా ఎన్నుకుందని, తన తక్షణ, ప్రధాన కర్తవ్యం సీఈవో ఎంపిక అని వ్యాఖ్యానించారు.
కంపెనీలో ఇటీవలి పరిణామాలపై భయపడాల్సిన అవసరం లేదంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. 26ఏళ్ల వయసపుడు ఇన్ఫోసిస్ లో చేరాను. ఇపుడు 62 వయసులో మళ్లీ ఇన్ఫోసిస్‌లో రీజాయిన్ అయ్యానని ట్వీట్ చేశారు జీవితం చక్రభమణంలా పూర్తిగా తిరిగిందంటూ తను పాత సంస్థలో మళ్లీ చేరిన ఉత్సాహాన్ని పంచుకున్నారు.
విశాల్ సిక్కా ఆకస్మిక రాజీనామాపై సంస్థ నిర్వహణ కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం ఉండదని నొక్కిచెప్పిన ఆయన కొత్త సీఈవో అన్వేషణలో ఉన్నామని, తుది నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని చెప్పారు. ఇందుకోసం ఈ బోర్డు ప్రపంచవ్యాప్తంగా తగిన అభ్యర్థిని శోధిస్తుందని, ఇన్ఫోసిస్ పూర్వ విద్యార్ధులతో సహా అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలిస్తానని చెప్పారు.
మరోవైపు సంస్థకు విశాల్ సిక్కా చేసిన కృషిని కూడా ఆయన అంగీకరించారు. ఆయన నేతృత్వంలో ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ముందుకు తీసుకువెళతామన్నారు. అలాగే కార్పొరేట్ గవర్నెన్స్‌లో నారాయణ మూర్తి తండ్రిలాంటివారంటూ ప్రశంసించారు. దీంతోపాటు మేనేజ్‌మెంట్ బోర్డులో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయనే సూచన కూడా అందించారు.
కాగా ప్రస్తుతం, ఇన్ఫోసిస్ బోర్డులో నందన్ నీలేకనితో సహా ఎనిమిది మంది ఉన్నారు. కిరణ్ మజుందార్ షా అధ్యక్షతన నామినేషన్ కమిటీ సీఈఓ నియామకాన్ని పరిశీలిస్తోంది.
Joined @Infosys at 26, re-joined it at 62. Life does turn full circle!
— Nandan Nilekani (@NandanNilekani) August 25, 2017