యజమాని-ఉద్యోగుల సంబంధాలు అంతంతమాత్రం
ముంబై: భారత్‌లో యజమాని - ఉద్యోగుల మధ్య సంబంధాలు ఏమంత బాగాలేవు. ఈ విషయంపై మోర్గాన్ స్టాన్లీ రూపొందించిన నివేదికలో ఇండియాకు 61వ స్థానం దక్కింది. మెక్సికో (44వ స్థానం), థాయిలాండ్ (37), ఫిలిప్పైన్ (34) మనకంటే మెరుగైన ర్యాంకుల్లో నిలిచాయి. పొరుగున ఉన్న చైనా 60వ స్థానంలో ఉంది.
‘ప్రపంచంలోని పెద్ద దేశాలతో పోలిస్తే మానవ వనరులు అధికంగా ఉన్న భారత్ అభివృద్ధిలో ముందుండాలి. కానీ, అభివృద్ధిని అవకాశంగా మలచుకోవడంలో ఇండియా పనితీరు మిశ్రమంగానే ఉంది. ఉత్పాదకతను పెంచే ఉద్యోగాల కల్పన ఇప్పటివరకు మందకొడిగానే ఉంది. ఇందుకు భౌతిక మౌలిక సౌకర్యాల కొరత వంటి కారణాలున్నప్పటికీ ముఖ్య కారణం కార్మిక చట్టాలే. వందమంది కంటే ఎక్కువ కార్మికులున్న కంపెనీల్లో లే ఆఫ్ ప్రకటించాలంటే దాన్ని నోటిఫై చేసి, సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది.
పాకిస్తాన్, శ్రీలంకలను మినహాయిస్తే ఇతర దేశాల్లో ఇలాంటి కఠిన నిబంధనలు లేవు. ఉద్యోగులను తీసుకోవడం, తొలగించడానికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు సూచీలో బంగ్లాదేశ్ 25, చైనా 28, పాకిస్తాన్ 35వ స్థానాల్లో ఉంటే ఇండియా 52వ ర్యాంకులో ఉంది. ఇక 148 దేశాల్లో లేబ ర్ మార్కెట్ సామర్థ్యం పరంగా భారత్ 99వ స్థానంలో ఉంది. చైనా 34, బ్రెజిల్ 92వ ర్యాం కుల్లో ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది.