‘పై అంతస్తు’ వేసేద్దాం!
సాక్షి, హైదరాబాద్ : సొంతిల్లు ఉండగానే సరిపోదు. పిల్లల చదువుల కోసమో లేక అవసరాల కోసమో కారణమేదైనా.. ఇంటిపై అదనపు ఫ్లోర్లు అవసరం ఉంటుంది. డాబాపై మరో ఫ్లోర్ వేసుకుంటే కొంత సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అలా ఫ్లోర్ వేయాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఆ గది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందంటున్నారు. అవేంటో చూద్దాంమరి.
ముందుగా డాబా ఏ తీరులో నిర్మించారో తెలుసుకోవాలి. దీన్ని బట్టే పై అంతస్తు ఎలా వేయాలన్నది ఆధారపడి ఉంటుంది. భవన నిర్మాణాలు రెండు రకాలు. 1. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేది. దీన్నే ‘లోడ్ బేరింగ్ వాల్ స్ట్రక్చర్’ అంటారు. లోతుగా పునాదుల కోసం గుంతలు తవ్వకుండా రాళ్లతో పునాదులు నిర్మించి ఆపై గోడలు, వాటిపై శ్లాబు నిర్మిస్తారు. ఈ నిర్మాణంలో భవనం బరువంతా గోడలు, పునాదుల పైనే పడుతుంది. 2. గోతులు తీసి పుటింగులు, పిల్లర్లు వేసి, బీములు నిర్మించి దానిపైన శ్లాబు వేసేది ‘ఫ్రేం స్ట్రక్చర్’. ఇందులో భవనం బరువంతా బీములు, పిల్లర్లు మోస్తాయి. గోడలపై ఎలాంటి భారం పడదు. ప్రస్తుతం ఈ తరహా నిర్మాణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి కాస్త ఎక్కువగానే ఖర్చవుతున్నప్పటికీ ఇల్లు దృఢంగా ఉంటుంది.
లోడ్ బేరింగ్ స్ట్రక్చర్‌పై మేడ..
పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులు వేసుకోవాలంటే.. గ్రౌండ్ ఫ్లోర్ గోడలు 14 అంగుళాల మందంతో నిర్మించాలి. ఫస్ట్ ఫ్లోర్ గోడలు మాత్రం 9 అంగుళాల మందంతో నిర్మిస్తే చాలు. అతి జాగ్రత్తకు పోయి ఇక్కడా 14 అంగుళాల గోడలు నిర్మిస్తే వృథా ఖర్చు. పైగా కింది గోడలపై భారం ఎక్కువవుతుంది. పైన గదులు విశాలంగా ఉండాలని చెప్పి 14 అంగుళాల గోడపై చివరి నుంచి 9 అంగుళాల గోడను నిర్మిస్తుంటారు. ఇది తప్పు. 14 అంగుళాల గోడకు కచ్చితంగా మధ్యలో 9 అంగుళాల గోడను నిర్మించాలి. లేకపోతే బరువు సరిగ్గా సర్దుబాటు కాక గోడలు దెబ్బతింటాయి. కిటికీలు, తలుపులు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టుగానే పైనా నిర్మించాలి.
ఇలా చేస్తే కింద అంతస్తులోని తలుపులు, కిటికీలపై అదనపు భారం పడకుండా ఇల్లు పటిష్టంగా ఉంటుంది. బాల్కనీ అంచుల్లో గోడలు కట్టాలన్నా శ్లాబు కింద బీములు తప్పనిసరి. పెద్ద పోర్టికో కావాలన్నా శ్లాబుల కింద బీములు ఉండాల్సిందే. వీలైనంత వరకు ఇలాంటి పద్ధతిలో మూడో అంతస్తు నిర్మించకపోవడమే మంచిది. 30 ఏళ్లు దాటిన పాత ఇళ్లపైన మరో అంతస్తు నిర్మించడం సరైన పద్ధతి కాదు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పూజ గదిపై మరుగుదొడ్డి రాకుండా జాగ్రత్తపడాలి. అంతేకాకుండా కింద ఉన్న పూజగదిపై నడిచే విధంగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడమే మంచిది.
ఫ్రేమ్ స్ట్రక్చర్డ్ అయితే..
ఇందులో గోడలన్నవి గదుల విభజన కోసమే. ఇవి ఎలాంటి బరువునూ మోయవు. కాబట్టి గోడలు ఎంత మందంతో నిర్మించినా పటిష్టతకు ఢోకా ఉండదు. పైన పిల్లర్లు వేసుకోవడానికి వదిలిన రాడ్లు, ఎండ, వాన ప్రభావానికి లోను కాకుండా డమ్మీ (దిమ్మ) కట్టడం తప్పనిసరి. ఇలా చేయకపోతే రాడ్లు తుప్పుపటి ్టపోతాయి. పిల్లర్లు, బీములతో నిర్మించినప్పుడు ముందుగా శ్లాబు పని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాతే గోడల నిర్మాణం మొదలుపెట్టాలి. పై ఫ్లోర్‌లో కింద గోడకు దూరంగా పైన గోడ నిర్మిస్తే తలుపులు, కిటికీలపై నాలుగు అంగుళాల మందంలో పిల్లర్‌లో కలిసే విధంగా లింటెల్ వేసుకోవాలి. ఇలా చేస్తే వీటి పైభాగంలో నిర్మించే గోడ బరువు దర్వాజపై పడకుండా పిల్లర్లకు మళ్లుతుంది.