లగ్జరీ కొనుగోళ్లూ ఆన్‌లైన్లోనే! | Luxury purchases in online | Sakshi
Sakshi News home page

లగ్జరీ కొనుగోళ్లూ ఆన్‌లైన్లోనే!

Published Wed, Nov 20 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

లగ్జరీ కొనుగోళ్లూ ఆన్‌లైన్లోనే!

లగ్జరీ కొనుగోళ్లూ ఆన్‌లైన్లోనే!

న్యూఢిల్లీ: ఆన్‌లైన్లో పెన్‌డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకి మాత్రమే పరిమితమైన కొనుగోలుదారులు ప్రస్తుతం లక్షలు, కోట్లు ఖరీదు చేసే వాటిని కూడా కొనడం మొదలుపెట్టారు. నగలు మొదలుకుని బైక్‌లు, వింటేజ్ కార్ల దాకా కొనేస్తున్నారు. రూ. 3.5 కోట్లు విలువ చేసే సోలిటెయిర్ చెవి దుద్దులు, రూ. 30 లక్షలు విలువ చేసే ఫోక్స్‌వ్యాగన్ కారు (ఐపీఎల్ టీమ్ కెప్టెన్లు సంతకాలు చేసినది), రూ. 7 లక్షల ఆస్టిన్ రూబీ వింటేజ్ కారు, రూ. 15 లక్షల ఖరీదు చేసే హార్లే డేవిడ్‌సన్ నైట్ రాడ్ మోటార్ సైకిల్... ఇలా ఒకటేమిటి అనేక లగ్జరీ వస్తువులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనేందుకు కొనుగోలుదారులు సందేహించడం లేదు. మెట్రోల్లాంటి ప్రధాన నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ ఈ ధోరణి పెరుగుతోంది. ఈబే, శ్నాప్‌డీల్, ఓఎల్‌ఎక్స్ వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్లు ఇందుకు మాధ్యమాలుగా ఉపయోగపడుతున్నాయి. బెల్గామ్, బులంద్‌షహర్ వంటి ప్రాంతాల నుంచి కూడా భారీ విలువ చేసే లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు జరుగుతున్నాయి.  

 ఆన్‌లైన్ ప్రయోజనాలు..
సాధారణంగా వింటేజ్ కార్లు, డైమండ్లు మొదలైన వాటి విషయాల్లో ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్‌లోనే పారదర్శకత ఎక్కువగా ఉంటోందని ఆన్‌లైన్ సంస్థలు చెబుతున్నాయి. పైగా ఎంపిక చేసుకునేందుకు విస్తృతమైన శ్రేణి కూడా అందుబాటులో ఉంటుంది. ఆయా విక్రేతల విశ్వసనీయతకు సంబంధించి ఇతర కొనుగోలుదారుల నుంచి వచ్చే సమీక్షలు సైతం తగిన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాల వల్లే కొనుగోలుదారు ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గుచూపుతున్నారని ఇటైలింగ్ సంస్థలు తెలిపాయి.

పెరుగుతున్న లావాదేవీల విలువ..
 సంపన్న దేశాలతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు సంబంధించి విలువపరంగా లావాదేవీ పరిమాణం కూడా ఇటీవలి కాలంలో భారీగాా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో ప్రతి ఆర్డరుపై సగటు బిల్లు విలువ సుమారు 25 శాతం మేర పెరిగినట్లు శ్నాప్‌డీల్ వర్గాలు తెలిపాయి. శ్నాప్‌డీల్‌లో అమ్ముడైన అత్యంత ఖరీదైన టీవీ (సోనీ బ్రావియా) విలువ సుమారు రూ. 3.75 లక్షలు. ఈబేలో ప్రతి నెలా 1,200 టీవీలు అమ్ముడవుతున్నాయి. తమకి వచ్చే ప్రతి పది ఆర్డర్లలో ఆరు ఆర్డర్లు చిన్న పట్టణాల నుంచే వస్తున్నాయని శ్నాప్‌డీల్ వర్గాలు తెలిపాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తుల స్టోర్లు చిన్న పట్టణాల్లో ఉండవు కాబట్టి.. అలాంటి వాటికోసం ఆయా ఊళ్లలో వారు ఇప్పటిదాకా పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈటైలింగ్ సైట్ల కారణంగా ఈ ధోరణి మారుతోంది.  ఇంటి దగ్గరే కూర్చుని ఆన్‌లైన్లో ఎంత ఖరీదైనవైనా ఆర్డరు ఇచ్చేస్తున్నారు. రాడో, రోలెక్స్ వంటి ఖరీదైన వాచీలకు కూడా ఈటైలింగ్ సైట్లలో ఎక్కువగా గిరాకీ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ లగ్జరీ కనెక్ట్ వర్గాలు వివరించాయి.  ఇలా కొనుగోళ్లు జరిపే వాళ్లలో 40 ఏళ్లు దాటనివారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నాయి. సాధారణంగా పసిడికి సంబంధించి రూ. 2 లక్షలకు మించి కొనుగోళ్లు జరిపితే పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది. ఇతరత్రా ఆభరణాలకైతే రూ. 5 లక్షల దాకా వెసులుబాటు ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement