వంట నూనెల వ్యాపారంలోకి మహీంద్రా
న్యూప్రో బ్రాండ్‌లో ఆవాల నూనె
కోల్‌కత : మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ వంటనూనెల వ్యాపారంలోకి ప్రవేశించింది. గ్రూప్‌నకు చెందిన వ్యవసాయ వ్యాపార విభాగం న్యూప్రో బ్రాండ్ పేరుతో ఆవాల నూనెను మార్కెట్లోకి తెచ్చింది. ఈ నూనెను ముందుగా కోల్‌కతాలో అందుబాటులోకి తెచ్చామని గ్రూప్ ఆగ్రి బిజనెస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ చెప్పారు. తర్వాత ఒడిశా, జార్ఖండ్‌ల్లో ప్రవేశపెడతామని వివరించారు. త్వరలోనే పాలు, పాల ఉత్పత్తులు, పప్పు దినుసుల రిటైల్ సెగ్మెంట్లోకి అడుగిడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం పప్పు దినుసులను బీ2బీ చానళ్ల ద్వారా విక్రయిస్తున్నామని తెలిపారు.
త్వరలోనే సన్‌ఫ్లవర్, సోయా, రైస్ బ్రాండ్ తదితర ఇతర వంటనూనెల రకాలను అందిస్తామని చెప్పారు. గత నాలుగేళ్లలో తమ వ్యవసాయ-వ్యాపారం ఆదాయం రూ.70 కోట్ల నుంచి రూ.580 కోట్లకు పెరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.