మార్కెట్ క్యాప్ పదేళ్లలో పది రెట్లు..!
అంతర్జాతీయంగా భారత్ సరైనస్థాయిని అందుకుంటే వచ్చే 10-15 ఏళ్లలో స్టాక్ మార్కెట్ విలువ పది రెట్లు పెరిగి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎండీ, సీఈఓ అశీష్ చౌహాన్ అన్నారు. అలా వృద్ధిచెందాలంటే మార్కెట్లు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌గా కాకుండా వివిధ రంగాల్లో పెట్టుబడులకు వేదికగా మారాల్సిన అవసరం వుందన్నారు. ప్రస్తుత మార్కెట్ క్యాప్ 1.6 ట్రిలియన్ డాలర్లు (రూ.100 లక్షల కోట్లకుపైగా) ఉంది.
మంచి మార్కెట్లలో పెట్టుబడుల కోసం అంతర్జాతీయంగా 40 ట్రిలియన్ డాలర్ల సంపద వేచిచూస్తున్నదని, అందులో తగిన వాటాను భారత్ పొందడానికి ప్రయత్నించాలని చౌహాన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం భారత్‌లో 2.7 కోట్ల మంది ఇన్వెస్టర్లు వున్నారని, ఈ సంఖ్యను 2030కల్లా 27 కోట్లకు పెంచడానికి చాలా చర్యలు అవసరమన్నారు.