మారుతీ కార్ల ధరల తగ్గింపు!
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ఇండియా తన కార్లలో రెండు మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. సియాజ్ ఎస్‌హెచ్‌వీఎస్ కారుపై రూ. 69,000, ఎర్టిగా ఎస్‌హెచ్‌వీఎస్ కారుపై రూ.62,000 వరకు రేటును తగ్గించినట్టు ప్రకటించింది. 24శాతంగా ఉన్న ఎక్సైజ్ డ్యూటీ 12.5 శాతానికి తగ్గడంతో, ఆమేరకు కార్ల ధరలు తగ్గిస్తున్నట్టు మారుతీ వెల్లడించింది. ఈ రేటు తగ్గింపు నిర్ణయం అనంతరం సియాజ్ ఎస్‌హెచ్‌వీఎస్ వేరియంట్ ధరలు రూ. 7.68 లక్షల నుంచి రూ. 9.49 లక్షల వరకు, ఎర్టిగా ఎస్‌హెచ్‌వీఎస్ వేరియంట్ ధర రూ. 7.08 లక్షల నుంచి రూ. 8.66 లక్షల వరకు తగ్గుతున్నాయి. (మొదటిది బేసిక్ మోడల్, రెండోది టాప్ ఎండ్ ధర)
సుజుకీ ఎస్‌హెచ్‌వీఎస్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లయిన సియాజ్, ఎర్టిగాలు నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్ఈఎమ్ఎమ్పీ) కిందకు వస్తాయి. ఈ ప్లాన్ కింద ఈ రెండు మోడళ్లు ఎక్సైజ్ డ్యూటీలో 50 శాతం తగ్గింపు అర్హత సాధించాయి. దీంతో సుజుకీ ఈ మోడళ్లపై ధరలు భారీగా తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తగ్గింపు ధరలు కేవలం ఢిల్లీలోనే అందుబాటులో ఉంటాయని, ఇతర ప్రాంతాల్లో వీటి ధరలు అంతకముందు మాదిరే ఉంటాయని మారుతీ సుజుకీ తెలిపింది. తగ్గింపు ధరలతో మారుతీ సుజుకీకి ప్రత్యర్థిగా ఉన్న హోండా సిటీ కన్నా సియాజ్ రూ. 2.19 లక్షలు తక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ఈ ప్రభావం కంపెనీ అమ్మకాలు పెరగడానికి దోహదం చేస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.