
మారుతీ లాభం 18% అప్
క్యూ3లో రూ.802 కోట్లు...
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ నికర లాభం రూ.802 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.681 కోట్లతో పోలిస్తే 17.8 శాతం వృద్ధి చెందింది.
ప్రధానంగా క్యూ3లో అమ్మకాల జోరుతో పాటు ఉత్పాదక వ్యయం తగ్గింపు చర్యలు, ఫారెన్ ఎక్స్ఛేంజ్(ఫారెక్స్)పరమైన రాబడులు... మెరుగైన లాభాలకు దోహదం చేసినట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది. కాగా, మొత్తం ఆదాయం క్యూ3లో 15.5 శాతం పెరిగి రూ.10,620 కోట్ల నుంచి రూ.12,263 కోట్లకు చేరింది.
విక్రయాలు 12 శాతం పెరిగాయ్...
క్యూ3లో కంపెనీ మొత్తం 3,23,911 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో అమ్మకాల సంఖ్య 2,88,151తో పోలిస్తే 12.4 శాతం పెరిగాయి. ఇక ఎగుమతులు కూడా 19,966 యూనిట్ల నుంచి 28,709 యూనిట్లకు వృద్ధి చెందాయి. ఎగుమతులపరంగా రూ.1,224 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా, వాహన పరిశ్రమకు మార్కెట్లో ఇంకా బలహీన సెంటిమెంట్ కొనసాగుతోందని.. డిమాండ్ పూర్తిస్థాయిలో పుంజుకోవడానికి మరికొంత కాలం పడుతుందని కంపెనీ సీఎఫ్‌ఓ అజయ్ సేథ్ పేర్కొన్నారు.
గడచిన క్వార్టర్‌లో ఒక్కో కారుపై సగటున దాదాపు రూ.21,000 చొప్పున డిస్కౌంట్‌ను ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం వరకూ ఈ డిస్కౌంట్లు కొనసాగే అవకాశం ఉందన్నారు. కాగా, ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం రాయితీలను వెనక్కితీసుకోవడంతో అనివార్యంగా ధరలను పెంచాల్సి రావడంతో కార్ల అమ్మకాలపై ప్రభావం పడుతోందని.. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ ప్రభావం అధికంగా ఉందని ఆయన వివరించారు.
గుజరాత్‌లో నెలకొల్పుతున్న కొత్త ప్లాంట్‌ను పూర్తిగా మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు వదిలిపెట్టడం.. పెట్టుబడులకు సంబంధించి మైనారిటీ వాటాదారుల నుంచి రానున్న ఆరు నెలల వ్యవధిలో ఆమోదం లభిస్తుందని భావిస్తున్నట్లు సేథీ చెప్పారు. కంపెనీల చట్టం-2013లో సవరణలకు రాజ్య సభ ఇంకా ఆమోదించాల్సి ఉన్నందున ఈ అంశంలో కొంత జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు..