మారుతీ స్విఫ్ట్‌లో కొత్త వేరియంట్
ధరల శ్రేణి రూ.4.42 లక్షలు-రూ.6.95 లక్షలు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ స్విఫ్ట్ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కొత్త స్విఫ్ట్‌ను అందిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్. ఎస్. కల్సి చెప్పారు. పెట్రోల్ కారు ధరలు రూ.4.42 లక్షల నుంచి రూ.5.9 లక్షలు, డీజిల్ కారు ధరలు రూ.5.56 లక్షల నుంచి రూ.6.95 లక్షలు (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయని వివరించారు.
మైలేజీ 10 శాతం అధికంగా వచ్చే ఈ కొత్త స్విఫ్ట్ కారులో పుష్ స్టార్ట్ బటన్, వెనక సీట్‌ను 60:40 నిష్పత్తిలో స్ప్లిట్ చేసుకునే వెసులుబాటు, రివర్స్ పార్కింగ్ సెన్సర్, రీట్రాక్టబుల్ అవుట్‌సైడ్ మిర్రర్‌లు తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఈ కొత్త కారు 25.2 కి.మీ. మైలీజీ(డీజిల్ వేరియంట్)నిస్తుందని తెలిపారు. మొదటగా స్విఫ్ట్ మోడల్‌ను 2005, మేలో మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 12 లక్షల కార్లను విక్రయించామని వివరించారు.