మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ.. | max cure hospitals another three centres in hyderabad | Sakshi
Sakshi News home page

మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ..

Published Wed, Sep 28 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ..

మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ..

డిసెంబర్‌కల్లా మరో మూడు కేంద్రాలు
1,750 పడకలకు చేరనున్న సామర్థ్యం
సాక్షితో సంస్థ సీఈవో హరికృష్ణ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ విస్తరణ బాటపట్టింది. కర్నూలులో 200 పడకల కేంద్రాన్ని రూ.35 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. అలాగే వైజాగ్‌లో ఒక్కొక్కటి 100 పడకల సామర్థ్యం గల రెండు ఆసుపత్రులను రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.10 కోట్లు వెచ్చించి ఈ రెండు ఆసుపత్రులను ఆధునీకరిస్తోంది. డిసెంబర్‌కల్లా మూడు ఆసుపత్రుల్లోనూ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మ్యాక్స్‌క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో పి.హరికృష్ణ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.

మాదాపూర్‌లో ఉన్న ఒక ఆసుపత్రిని విస్తరిస్తున్నామని, తద్వారా మరో 50 పడకలు జతకూడతాయని చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్, నిజామాబాద్, నెల్లూరులో ఒక్కో హాస్పిటల్ ఉంది. వీటి పడకల సామర్థ్యం 1,300. విస్తరణతో మొత్తం సామర్థ్యం 1,750 పడకలకు చేరనుంది. వరంగల్‌లో ఆసుపత్రిని ఏర్పాటు చేసే అవకాశాన్ని సంస్థ పరిశీలిస్తోంది.

హాస్పిటల్ చైన్స్‌తో చర్చలు..
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైన మ్యాక్స్‌క్యూర్ ఇతర రాష్ట్రాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, గుజరాత్‌లో పలు ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెండు సంస్థలతో చర్చిస్తోంది. చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. ఇవి సఫలమైతే మ్యాక్స్‌క్యూర్ ఖాతాలోకి మరో 15 ఆసుపత్రులు వచ్చి చేరతాయని హరికృష్ణ వెల్లడించారు. డీల్ పూర్తి కావడానికి రెండేళ్లు పట్టొచ్చని సూత్రప్రాయంగా చెప్పారు. ఇందుకు రూ.600 కోట్లు అవసరమవుతాయని అన్నారు.

ఐపీవోకు వెళ్లడం ద్వారా నిధులు సమీకరిస్తామని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు తూర్పు ఆసియాలో విస్తరించాలన్నది సంస్థ లక్ష్యమని వివరించారు. ఇక మ్యాక్స్‌క్యూర్ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 3,600 ఉంది. విస్తరణ పూర్తి అయితే ఈ సంఖ్య 5,000 దాటుతుందని సీఈవో చెప్పారు. 350 మందికిపైగా సూపర్ స్పెషలిస్టులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏటా 5 లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement