న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ తన కస్టమర్లకు వార్నింగ్ ఇస్తోంది. నార్త్, ఈస్ట్ ఇండియాలో కొనసాగుతున్న తమ బ్రాండెడ్ అవుట్‌లెట్లలో తినొద్దంటూ కస్టమర్లకు సీరియస్ హెచ్చరికలు జారీచేస్తోంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు(సీపీఆర్‌ఎల్) నిర్వహిస్తున్న తమ ఈ బ్రాండెడ్ అవుట్‌లెట్లలో తింటే, ఆరోగ్య సమస్యల బారిన పడతారంటూ పేర్కొంటోంది. ఈ రెస్టారెంట్లలో వాడే పదార్థాలు, తమ అంతర్జాతీయ ప్రమాణాకలు అనుగుణంగా లేవని మెక్‌డొనాల్డ్స్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. సీపీఆర్‌ఎల్ వీటిని మూత వేయాల్సి ఉందన్నారు.
సీపీఆర్‌ఎల్, మెక్ డొనాల్డ్స్ ఇండియా జాయింట్ వెంచర్ 50:50గా ఉంది. ఈ జాయింట్ వెంచర్‌లో 160 అవుట్‌లెట్లు కొనసాగుతున్నాయి. వీటిలో 84 అవుట్‌లెట్లు ఈ వారం ప్రారంభంలో మూతపడ్డాయి. బకాయిలు చెల్లించని కారణంగా సీపీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ పార్టనర్ రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ తన సర్వీసులను రద్దు చేసింది. ఈ కారణంతో అవుట్‌లెట్లు కూడా క్లోజయ్యాయి. ఫ్రాంచైజీ అగ్రిమెంట్ రద్దు చేసినప్పటి నుంచి బర్గర్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌కు, సీపీఆర్‌ఎల్‌కు న్యాయపోరాటం నడుస్తోంది. ఈ వివాదంతో అనేక సరఫరాదారులు బయటికి వచ్చేసినప్పటికీ, రెస్టారెంట్లు తెరిచే ఉన్నాయి.
ఫ్రాంచైజీ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నప్పటి నుంచి సీపీఆర్‌ఎల్ అనధికారికంగా రెస్టారెంట్లను నిర్వహిస్తోందని, మెక్‌డొనాల్డ్స్ సిస్టమ్‌లోకి సరఫరా చేసేందుకు తెలియని డిస్ట్రిబ్యూటర్‌ను తాము ఆమోదించేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మెక్‌డొనాల్డ్స్ ఆరోపణలపై స్పందించిన సీపీఆర్‌ఎల్ ఎండీ విక్రమ్ భక్షి, రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ కంటే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌ను నియమించుకున్నట్టు తెలిపింది. లాజిస్టిక్స్ పార్టనర్‌గా కోల్డ్‌ఎక్స్‌ను ఎంపికచేసుకున్నట్టు పేర్కొంది. కేఎఫ్‌సీ, స్టార్‌బక్స్, పిజ్జా హట్, బర్గర్ కింగ్, వెండీస్ అండ్ కార్ల్స్ జూనియర్, ఏడీబీ వంటి వాటికి కోల్డ్‌ఎక్స్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment