CPRL
-
మెక్‌డొనాల్డ్స్ వార్నింగ్ : అక్కడ తింటే ఖతమే
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ తన కస్టమర్లకు వార్నింగ్ ఇస్తోంది. నార్త్, ఈస్ట్ ఇండియాలో కొనసాగుతున్న తమ బ్రాండెడ్ అవుట్లెట్లలో తినొద్దంటూ కస్టమర్లకు సీరియస్ హెచ్చరికలు జారీచేస్తోంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు(సీపీఆర్ఎల్) నిర్వహిస్తున్న తమ ఈ బ్రాండెడ్ అవుట్లెట్లలో తింటే, ఆరోగ్య సమస్యల బారిన పడతారంటూ పేర్కొంటోంది. ఈ రెస్టారెంట్లలో వాడే పదార్థాలు, తమ అంతర్జాతీయ ప్రమాణాకలు అనుగుణంగా లేవని మెక్‌డొనాల్డ్స్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. సీపీఆర్ఎల్ వీటిని మూత వేయాల్సి ఉందన్నారు. సీపీఆర్ఎల్, మెక్ డొనాల్డ్స్ ఇండియా జాయింట్ వెంచర్ 50:50గా ఉంది. ఈ జాయింట్ వెంచర్లో 160 అవుట్లెట్లు కొనసాగుతున్నాయి. వీటిలో 84 అవుట్లెట్లు ఈ వారం ప్రారంభంలో మూతపడ్డాయి. బకాయిలు చెల్లించని కారణంగా సీపీఆర్ఎల్ లాజిస్టిక్స్ పార్టనర్ రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ తన సర్వీసులను రద్దు చేసింది. ఈ కారణంతో అవుట్లెట్లు కూడా క్లోజయ్యాయి. ఫ్రాంచైజీ అగ్రిమెంట్ రద్దు చేసినప్పటి నుంచి బర్గర్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌కు, సీపీఆర్‌ఎల్‌కు న్యాయపోరాటం నడుస్తోంది. ఈ వివాదంతో అనేక సరఫరాదారులు బయటికి వచ్చేసినప్పటికీ, రెస్టారెంట్లు తెరిచే ఉన్నాయి. ఫ్రాంచైజీ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నప్పటి నుంచి సీపీఆర్ఎల్ అనధికారికంగా రెస్టారెంట్లను నిర్వహిస్తోందని, మెక్‌డొనాల్డ్స్ సిస్టమ్‌లోకి సరఫరా చేసేందుకు తెలియని డిస్ట్రిబ్యూటర్ను తాము ఆమోదించేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మెక్‌డొనాల్డ్స్ ఆరోపణలపై స్పందించిన సీపీఆర్ఎల్ ఎండీ విక్రమ్ భక్షి, రాధాక్రిష్ణా ఫుడ్‌ల్యాండ్ కంటే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌ను నియమించుకున్నట్టు తెలిపింది. లాజిస్టిక్స్ పార్టనర్‌గా కోల్డ్ఎక్స్ను ఎంపికచేసుకున్నట్టు పేర్కొంది. కేఎఫ్‌సీ, స్టార్‌బక్స్, పిజ్జా హట్, బర్గర్ కింగ్, వెండీస్ అండ్ కార్ల్స్ జూనియర్, ఏడీబీ వంటి వాటికి కోల్డ్ఎక్స్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంది. -
మెక్‌డొనాల్డ్స్‌కి గుడ్‌బై: సగం పైగా మూత
మెక్‌డొనాల్డ్స్ బర్గర్, పిజ్జా... అంటే పడి చచ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. ఫుల్‌గా ఆస్వాదిస్తూ తెగ లాగించేస్తూ ఉంటారు. అయితే మెక్‌డొనాల్డ్స్‌కు, కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) మధ్య నెలకొన్న వివాదంతో, సగానికి పైగా ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ అవుట్లెట్లు మూత పడ్డాయి. లాజిస్టిక్స్ పార్టనర్ల వద్ద నుంచి సరఫరా లేకపోవడంతో వీటిని మూత వేస్తున్నట్టు మెక్‌డొనాల్డ్స్ జాయింట్ వెంచర్ పార్టనర్ విక్రమ్ భక్షి తెలిపారు. తూర్పు భారతంలో అన్ని అవుట్లెట్లు, ఉత్తర భారతంలో పలు అవుట్లెట్లు మొత్తం 80 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే కొన్ని రోజుల్లో మరిన్ని అవుట్లెట్లు కూడా మూతపడబోతున్నట్టు పేర్కొన్నారు. రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ తను అందించే సర్వీసులను అకస్మాత్తుగా ఆపివేసిందని, పీక్ సీజన్లో ఇలా ఆపివేయడం పలు అనుమానాలకు తావిస్తుందని భక్షి చెప్పారు. సీపీఆర్ఎల్ భక్షి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్యనున్న 50:50 జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్లో 160 అవుట్లెట్లను నడుపుతున్నారు. సర్వీసులు ఆపివేయడంపై రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్, కూడా సీపీఆర్‌ఎల్‌కు లేఖ రాసింది. వాల్యుమ్ తగ్గడం, భవిష్యత్తుపై అనిశ్చిత వంటి పలు కారణాలతో సప్లయ్ చైన్ సర్వీసులను ఆపివేస్తున్నామని రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ తెలిపింది. పండుగ సీజన్లో మెక్‌డొనాల్డ్స్‌కు భారీ ఎత్తున్న బిజినెస్ నడుస్తుంది. కానీ అకస్మాత్తుగా రాధాక్రిష్ణ ఫుడ్‌ల్యాండ్ సర్వీసులు ఆపివేయడం, దీని రెవెన్యూలపై ప్రభావం చూపనుంది. -
169 స్టోర్లు మూత:వేల ఉద్యోగాలు గల్లంతు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర, దక్షిణ భారతదేశంలో మెక్ డొనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్పీఎల్)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్ డొనాల్డ్స్ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడ నున్నాయి. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. మెక్‌డోనాల్డ్స్ ప్రకారం మొత్తం 169 దుకాణాల్లో మెక్ డొనాల్డ్స్ ట్రేడ్ మార్క్ ఆహార ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబరు 6 నుంచి తన బ్రాండ్ పేరు , ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించే అధికారం సీఆర్‌పీఎల్‌కు లేదని పేర్కొంది. రద్దు నోటీసు కాలం సెప్టెంబరు 5 న ముగిసినందున, మెక్‌డొనాల్డ్ మేధో సంపత్తిని ఉపయోగించేందుకు సీఆర్‌పీఎల్‌కు అధికారం లేదు. అంటే వారు మెక్‌డొనాల్డ్ పేర్లు, ట్రేడ్‌మార్క్ పేర్లు, డిజైన్లు, బ్రాండింగ్, మార్కెటింగ్ లాంటివి ఉపయోగించడం మానివేయాలి. దీనికి సంబంధించి చట్టపరమైన , ఒప్పంద హక్కుల ప్రకారం తాము వ్యవహరించనున్నామని మెక్‌డోనాల్డ్ ఇండియా ప్రతినిధి చెప్పారు. అయితే స్టోర్లమూసివేతపై సీఆర్పీఎల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు బుధవారం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నామని కంపెనీ ఎండీ విక్రమ్ బక్షి చెప్పారు. ఈ స్టోర్ల మూసివేత కారణంగా వేలాదిమంది ఉద్యోగులను రోడ్డుమీదికి నెట్టివేయనుందన్నారు. అంతేకాదు ఇది తమ వ్యాపారంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విక్రమ్ బక్షి తెలిపారు. దాదాపు 10 వేల మంది (ప్రత్యక్షంగా ,పరోక్షంగా)తో పాటు కంపెనీ సరఫరాదారులు, ఇతర వ్యాపార భాగస్వాములకు తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పారు. కాగా మెక్‌డొనాల్డ్‌తో ఫ్రాంఛైజ్ ఒప్పందం రద్దును సవాలు చేస్తూ సీఆర్పీఎల్ పిటిషన్‌ను మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టివేసింది. సీఆర్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే -
సీపీఆర్‌ఎల్‌తో మెక్‌డొనాల్డ్స్ కటీఫ్
న్యూఢిల్లీ: ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, చెల్లింపుల ఎగవేత తదితర ఆరోపణలపై కనాట్ ప్లాజా రెస్టారెంట్‌తో (సీపీఆర్ఎల్) మెక్‌డొనాల్డ్స్ ఇండియా తెగతెంపులు చేసుకుంది. దీంతో సీపీఆర్ఎల్ తన అవుట్‌లెట్స్‌లో ఎక్కడా కూడా మెక్‌డొనాల్డ్స్ బ్రాండ్‌ను ఉపయోగించుకోవడానికి వీలుండదు. అయితే, ఉద్యోగులు, సరఫరాదారులు, అవుట్‌లెట్స్‌కు స్థలం ఇచ్చిన యజమానులపై ప్రతికూల ప్రభావం పడకుండా తగు పరిష్కార మార్గం కనుగొనే దిశగా సీపీఆర్‌ఎల్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని మెక్‌డొనాల్డ్స్ ఇండియా పేర్కొంది. సీపీఆర్ఎల్ ప్రస్తుతం తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో 169 ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీలో సీపీఆర్ఎల్ ఆధ్వర్యంలో నడుస్తున్న 43 అవుట్‌లెట్స్ లైసెన్సులను పునరుద్ధరించుకోకపోవడం వల్ల మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
43 మెక్‌డొనాల్డ్స్ మూత, ఉద్యోగాలు గోవింద
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో మెక్డీలు మూత పడే స్థాయికి వచ్చింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న మొత్తం 55 రెస్టారెంట్లలో 43 మూడింటిని మూతవేయాలని సీపీఆర్ఎల్ బోర్డు నిర్వహించింది. నేటి(గురువారం) నుంచి ఇవి మూతపడనున్నాయి. '' ఇది చాలా దురదృష్టకరం. కానీ సీపీఆర్‌ఎల్‌కు చెందిన 43 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసి వేయాల్సి వస్తుంది'' అని సీపీఆర్ఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి చెప్పారు. సీపీఆర్ఎల్ మొత్తం 168 రెస్టారెంట్లను ఆపరేట్ చేస్తోంది. బక్షి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా లేనప్పటికీ, ఆయన, తన భార్యతో కలిసి సీపీఆర్ఎల్లో బోర్డు సభ్యులుగా ఉంటున్నారు. సీపీఆర్ఎల్ బోర్డులో మెక్‌డొనాల్డ్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులూ ఉన్నారు. కానీ బుధవారం ఉదయం స్కైప్ ద్వారా నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో 1,700 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే మూసివేసే విషయానికి గల ప్రధాన కారణాలను ఈ జాయింట్ వెంచర్ భాగస్వామి వెల్లడించలేదు. బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు వివాదం తలెత్తడంతో, సీపీఆర్ఎల్ కచ్చితంగా చేయాల్సిన రెగ్యులేటరీ హెల్త్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించలేదు. 2013 ఆగస్టులో సీపీఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తొలగించబడ్డ బక్షి, మెక్‌డొనాల్డ్స్‌తో వివాదానికి దిగారు. ఈ విషయంపై కంపెనీ లా బోర్డులో విచారణ కూడా జరుగుతోంది. బక్షికి వ్యతిరేకంగా మెక్‌డొనాల్డ్స్ కూడా లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ దాఖలు చేసింది. నార్త్, ఈస్ట్ ఇండియాలో మాత్రమే మెక్డీలను కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సౌత్, వెస్ట్ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్ ఆపరేషన్లను హార్డ్ క్యాసిల్ రెస్టారెంట్ల ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సీపీఆర్ఎల్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మెక్‌డొనాల్డ్స్‌కు ప్రమాదకరమని బ్రాండింగ్ నిపుణులు చెబుతున్నారు.