43 మెక్‌డొనాల్డ్స్ మూత, ఉద్యోగాలు గోవింద
43 మెక్‌డొనాల్డ్స్ మూత, ఉద్యోగాలు గోవింద
Published Thu, Jun 29 2017 10:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్‌ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో మెక్‌డీలు మూత పడే స్థాయికి వచ్చింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న మొత్తం 55 రెస్టారెంట్లలో 43 మూడింటిని మూతవేయాలని సీపీఆర్‌ఎల్ బోర్డు నిర్వహించింది. నేటి(గురువారం) నుంచి ఇవి మూతపడనున్నాయి. '' ఇది చాలా దురదృష్టకరం. కానీ సీపీఆర్‌ఎల్‌కు చెందిన 43 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసి వేయాల్సి వస్తుంది'' అని సీపీఆర్‌ఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి చెప్పారు. సీపీఆర్‌ఎల్ మొత్తం 168 రెస్టారెంట్లను ఆపరేట్ చేస్తోంది.
బక్షి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా లేనప్పటికీ, ఆయన, తన భార్యతో కలిసి సీపీఆర్‌ఎల్‌లో బోర్డు సభ్యులుగా ఉంటున్నారు. సీపీఆర్‌ఎల్ బోర్డులో మెక్‌డొనాల్డ్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులూ ఉన్నారు. కానీ బుధవారం ఉదయం స్కైప్ ద్వారా నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో 1,700 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే మూసివేసే విషయానికి గల ప్రధాన కారణాలను ఈ జాయింట్ వెంచర్ భాగస్వామి వెల్లడించలేదు.
బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు వివాదం తలెత్తడంతో, సీపీఆర్‌ఎల్ కచ్చితంగా చేయాల్సిన రెగ్యులేటరీ హెల్త్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించలేదు. 2013 ఆగస్టులో సీపీఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తొలగించబడ్డ బక్షి, మెక్‌డొనాల్డ్స్‌తో వివాదానికి దిగారు. ఈ విషయంపై కంపెనీ లా బోర్డులో విచారణ కూడా జరుగుతోంది. బక్షికి వ్యతిరేకంగా మెక్‌డొనాల్డ్స్ కూడా లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ దాఖలు చేసింది. నార్త్, ఈస్ట్ ఇండియాలో మాత్రమే మెక్‌డీలను కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సౌత్, వెస్ట్ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్ ఆపరేషన్లను హార్డ్ క్యాసిల్ రెస్టారెంట్ల ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సీపీఆర్‌ఎల్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మెక్‌డొనాల్డ్స్‌కు ప్రమాదకరమని బ్రాండింగ్ నిపుణులు చెబుతున్నారు.
Advertisement