సూపర్‌ వాటర్‌ ఫిల్టర్‌ : ధర రూ. 30 | Mechanical engineer made Rs 30 Portable water filter | Sakshi
Sakshi News home page

సూపర్‌ వాటర్‌ ఫిల్టర్‌ : ధర రూ. 30

Published Mon, Sep 9 2019 11:25 AM | Last Updated on Mon, Sep 9 2019 12:05 PM

Mechanical engineer made Rs 30 Portable water filter - Sakshi

నిర్‌నల్‌ రూపకర్త నిరంజన్‌ కరాగి

సాక్షి, బెంగళూరు : ఔత్సాహిక యువకుడు తన వినూత్న ఆలోచనతో విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది  పలికాడు. అతి తక్కువ వ్యయంతో పోర్టబుల్‌ వాటర్ ఫిల్టర్‌ను తయారు చేసిన పలువురి ప్రశంసలందు కుంటున్నాడు. మామూలు క్యాప్‌లా వుండే ఈ చిన్న పరికరం ద్వారా ఎంత మురికిగా ఉన్న నీటినైనా క్షణాల్లో పరిశుభ్రంగా మార్చుకోవచ్చు. మనం వినియోగించే అతి చిన్న వాటర్‌ బాటిల్స్‌కు  దీన్ని వాడుకోవచ్చు. ‘ప్యూరిట్‌ ఇన్‌ పాకెట్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ సాధనం ధర కేవలం రూ. 30 మాత్రమే. 30 రూపాయలలో స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఈ పరికరాన్ని త్వరలోనే పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవాలని ప్రయత్నంలో ఉన్నారు  దీని  రూపకర్త. దీంతోపాటు సముద్ర నీటిని కూడా శుద్ధమైన తాగునీటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఈ ప్రక్రియలో దీన్నుంచి విద్యు‍త్తును ఉత్పత్తి చేయాలనేది తమ భవిష్యత్తుగా ప్రణాళికగా చెప్పారు.  కర్నాటకకు చెందిన 22 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ నిరంజన్‌ కరాగి దీని సృష్టికర్త. 

ఆవిష్కరణకు నాంది  ఎలా అంటే 
బెల్గాంలోని  ఒక ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న స్టేడియంలో ఆడటానికి వెళ్ళాడు, అక్కడ విద్యార్థులు ట్యాప్ నుండి అపరిశుభ్రమైన నీరు తాగడం చూసి కలత చెందాడు. మరుసటి రోజు సాయంత్రం మార్కెట్లో వాటర్‌ ఫిల్టర్ల రేట్లను  పరిశీలించాడు.  వాటి ఖరీదు  అతనిని బాధ మరింత రెట్టింపైంది. దీంతో  పరిష్కారం వైపు దృష్టి సారించాడు.  ఆ ఆలోచన కొత్త ఆవిష్కారానికి బీజం వేసింది.  కొన్ని రోజుల నిరంతర శ్రమ తరువాత  100 లీటర్ల నీటిని శుభ్రంచేసే చిన్న వడపోత యంత్రాన్ని రూపొందించాడు.  దాన్ని తన ప్రొఫెసర్లకు చూపించాడు, కాని అది చాలా చిన్న ప్రాజెక్ట్ కావడంతో వారు దానిపై ఆసక్తి చూపలేదు. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా పట్టుదలగా ముందుకు కదిలాడు. సరసమైన ధరలో దీనిని పేదలకు అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. కానీ ఇందుకోసం పెట్టుబడి కావాలి కదా. చివరకు  దేశ్‌పాండే ఫౌండేషన్  వారి సహకారంతో  2017లో రూ .12,000  పెట్టుబడితో ఈ ట్యాప్ లాంటి ఫిల్టర్లను తయారు చేయడం  ప్రారంభించాడు.

అసలు దీని  ప్రారంభ ధర 20 రూపాయలు  మాత్రమే. అయితే జీఎస్‌టీ  ప్రవేశపెట్టిన తరువాత అతను దానిని రూ .30 కి పెంచాల్సి వచ్చిందట. ప్రధానంగా సోషల్‌ మీడియా ద్వారానే తన పరికరానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని నిరంజన్‌ సంతోషంగా చెబుతారు.  ప్రస్తుతం 2000 లీటర్ల నీటిని శుభ్రపరచగల అధునాతన ఫిల్టర్‌ను అభివృద్ధి చేస్తున్నాననీ, దీనికి రూ .100 -150 రూపాయలు ఖర్చు అవుతుందని నిరంజన్ తెలిపారు. అలాగే  మార్కెట్‌లో లభించే ఖరీదైన ఫిల్టర్లతో పోలిస్తే తన నిర్‌నల్‌ భారతదేశంలో అత్యంత సురక్షితమైన, శుభ్రమైన తాగునీటిని అందిస్తుందని, 95 శాతం బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని హామీ ఇస్తున్నారు.

అవార్డులు
కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఎలివేట్ 100 కార్యక్రమంలో రూ .20 లక్షల సీడ్ ఫండింగ్‌, సహా వివిధ కార్యక్రమాలలో అవార్డులను గెలుచుకుంది. పాల్గొన్న 1,700 మందిలో బహుమతి నిరంజన్‌ గెలుచుకున్నారు.  అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌కెసిసిఐ) నుండి ప్రశంసలు అందు​కోవడం విశేషం. తాజాగా సెప్టెంబర్ 7 న బెంగళూరులో నిర్వహించిన  ఒక కార్యక్రమంలో  ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్’ అవార్డును కూడా అందుకున్నారు.

వాస్తవానికి, ఈ ప్రత్యేక వడపోత పరికరం డల్లాస్‌లోని భారతీయుల ఆధ్వర్యంలోని  'కుచ్ కుచ్ బాతేం' అనే రేడియో కార్యక్రమంలో ప్రసారం కావడంతో వెలుగులోకి వచ్చింది. యుఎస్‌లోని 40 ప్రాంతాలలో ఇది ప్రసారం కావడంతో కార్యక్రమం తరువాత, నిరంజన్ తన ఉత్పత్తికి విరివిగా ఆర్డర్లు వచ్చాయి.  నిరంజన్‌ వ్యాపారానికి  దేశంలోని కర్ణాటక , మహారాష్ట్రలతోపాటు,  సింగపూర్, ఖతార్, ఆఫ్రికానుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement