గ్రెనేడ్ల దాడిని తట్టుకునే బెంజ్ కారు
⇒ మెర్సిడెస్-బెంజ్ ఎస్ 600 గార్డ్
⇒ ధర రూ.8.9 కోట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్, ఎస్ 600 గార్డ్ మోడల్‌లో అప్‌డేటెడ్ వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. రైఫిల్స్ దాడిని, గ్రెనేడ్, ఇతర పేలుడు పదార్ధాల దాడులను తట్టుకోగలిగే కారు ధరలు రూ.8.9 కోట్ల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.
అత్యున్నత స్థాయి అధికారులు, పారిశ్రామిక వేత్తలు లాంటి హై ప్రొఫైల్ కస్టమర్ల కోసం దీనిని రూపొందించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. భారత్‌లో ఇప్పటికే ఇలాంటి రక్షణ కవచాన్ని కల్పించే గార్డ్ పోర్ట్‌ఫోలియో కార్లు.. ఈ-గార్డ్, ఎం-గార్డ్‌లను అందిస్తున్నామన్నారు. ఎస్ 600 గార్డ్ కారు కోసం ఇప్పటికే కొన్ని ఆర్డర్లు వచ్చాయని తెలిపారు.
కారు ప్రత్యేకతలు...: అత్యున్నత రక్షణ ఫీచర్లతో ఈ కారును అందిస్తున్నామని గార్డ్ పోర్ట్‌ఫోలియో సేల్స్ అధిపతి మార్కస్ రుబెన్‌బర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు ఇదని పేర్కొన్నారు. శక్తివంతమైన వీ12 ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారులో ఏర్‌మాటిక్ సస్పెన్షన్, ఇంటెలిజెంట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఆటోమేటిక్ యాక్టివేషన్‌తో కూడిన ఫైర్ ఎక్స్‌టింగిషర్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.
350 లీటర్ల బూట్ స్పేస్, ఎనర్‌గైజింగ్ మస్సాజ్ ఫంక్షన్, నైట్ వ్యూ అసిస్ట్ ప్లస్, ఎల్‌ఈడీ ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్, 7జీ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ఆకర్షణలున్నాయి. వెనక సీట్లను అవసరమైనప్పుడు మొబైల్ ఆఫీస్‌గా మార్చుకోవచ్చు. టైర్లు డ్యామేజీ అయినప్పటికీ, 80 కిమీ దూరం ప్రయాణించవచ్చు. 4 లేదా 5 సీట్ల వేరియంట్‌లలో లభ్యం.