
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరోసారి కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. యూరో మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగితే ఏప్రిల్ నుంచి తమ మోడల్ కార్ల ధరలను పెంచే వీలుందని కంపెనీ ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘యూరో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90 స్థాయి వద్ద ఉన్నప్పుడు కార్ల ధరలు నిర్ణయించాం. ఇప్పుడు యూరో 95 స్థాయికి చేరుకుంది. గణనీయంగా పెరిగిన మారకపు విలువ ఏప్రిల్ నుంచి కార్ల ధరల పెంపునకు దారి తీయోచ్చు’ అన్నారు.
ఇప్పటికే ఈ జనవరిలో మెర్సిడెస్ కార్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. టెస్లా రాకపై అయ్యర్ స్పందిస్తూ.. కొత్త సంస్థ రాక ఎప్పుడూ మార్కెట్ వృద్ధికి తోడ్పడుతుంది. డిమాండ్ పెంచే సంస్థలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది మెర్సిడెస్ బెంజ్ ఇండియా రికార్డు స్థాయిలో 19,565 కార్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది(2023)లో 17,408 యూనిట్లను అమ్మింది.
ఇదీ చదవండి: పూనావాలా ఫిన్ వాణిజ్య వాహన రుణాలు
అదే బాటలో కియా ఇండియా
కియా ఇండియా సైతం కారు ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. అధిక కమోడిటీ ధరలు, ఇన్‌పుట్ వ్యయాలు, సప్లై సంబంధిత ఖర్చుల కారణంగా అన్ని మోడళ్ల వాహన ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘‘పెరిగిన వ్యయ భారం కస్టమర్లపై పడకుండా ఉండేందుకు వీలైనంత వరకు ప్రయత్నం చేసినప్పటికీ.. కొంత భారాన్ని మాత్రం కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తోంది. అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment